Share News

‘ఘోస్ట్‌ సిమ్‌’ దందాపై ఆక్టోపస్‌ ఉక్కుపాదం

ABN , Publish Date - May 21 , 2026 | 03:31 AM

సైబర్‌ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి.. సైబర్‌ నేరాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైదరాబాద్‌ సిటీ పోలీసులు..

‘ఘోస్ట్‌ సిమ్‌’ దందాపై ఆక్టోపస్‌ ఉక్కుపాదం

  • సిమ్‌ కోసం వచ్చే వారిని ఏమార్చి డబుల్‌ సిమ్‌లను యాక్టివేట్‌ చేస్తున్న నేరగాళ్లు

  • ఆ సిమ్‌లతో రూ.101.87 కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ క్రిమినల్స్‌

  • ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 3.0లో భాగంగా 13 రాష్ట్రాల్లో 18 పోలీస్‌ బృందాల గాలింపు

హైదరాబాద్‌ సిటీ, మే 20(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి.. సైబర్‌ నేరాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైదరాబాద్‌ సిటీ పోలీసులు.. ఆపరేషన్‌ అక్టోపస్‌ 3.0 పేరుతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ఘోస్ట్‌ సిమ్‌ నెట్‌వర్క్‌ గుట్టు రట్టు చేశారు. సిమ్‌ కోసం వచ్చే వినియోగదారులకు తెలియకుండా వారి పేరిట యాక్టివేట్‌ చేసే అదనపు సిమ్‌లే ‘ఘోస్ట్‌ సిమ్‌’లు. ఇప్పటికే మ్యూల్‌ ఖాతాదారులపై ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 1.0.. సైబర్‌ నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 2.0ను విజయవంతంగా నిర్వహించిన పోలీసులు సుమారు 25 రాష్ట్రాల్లో గాలించి, 32 మంది బ్యాంక్‌ మేనేజర్లు సహా.. 156 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 3.0లో భాగంగా.. ఘోస్ట్‌ సిమ్‌ దందాను లక్ష్యంగా చేసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన 1194 ఘోస్ట్‌ సిమ్‌ నంబర్ల ఆధారంగా.. 18 పోలీస్‌ బృందాలతో 13 రాష్ట్రాల్లో గాలింపు చేపట్టి 66 మందిని అరెస్టు చేశారు. వారిలో 44 మంది ఘోస్ట్‌ సిమ్‌లను వినియోగిస్తున్నవారు కాగా.. మిగతా 22 మందిలో 20 మంది పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ ఏజెంట్లు, టెలికం ప్రమోటర్లు. ఇద్దరు.. సిమ్‌ కార్డుల సరఫరాదారులు. పీవోఎస్‌ ఏజెంట్లలో వొడాఫోన్‌ ఐడియాకు చెందిన 10 మంది, ఎయిర్‌టెల్‌కు చెందినవారు ఏడుగురు, జియోకి చెందినవారు ముగ్గురు ఉన్నారు. వీరు ఘోస్ట్‌ సిమ్‌లను సైబర్‌ నేరగాళ్లకు అందిస్తున్నారు. అరెస్టయినవారి నుంచి పోలీసులు 544 సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 432 సీల్డ్‌ సిమ్‌లు ఉండగా.. 112 ఓపెన్డ్‌ సిమ్‌లు ఉన్నాయి. కాగా.. పోలీసుల చేతికి చిక్కిన వారంతా దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్‌ నేరాల్లో భాగస్వాములని తేలింది. ఈ నేరాలకు సంబంధించి సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన మొత్తం రూ.101.87 కోట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, హరియాణా, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పోలీసు బృందాలు దాడులు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు.


ఇలా మాయ చేస్తారు..

వినియోగదారులు కొత్త సిమ్‌ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్‌ నంబర్‌ పొర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు.. వారి నుంచి వేలిముద్రలు తీసుకునే క్రమంలో.. ‘నెట్‌వర్క్‌ సరిగా లేదు’, ‘సర్వర్‌ డౌన్‌ అయ్యింది’, ‘వేలిముద్ర సరిగా పడలేదు’ అని అబద్ధాలు చెప్పి రెండు, మూడుసార్లు వేలిముద్రలు తీసుకుంటున్నట్టు తేలింది. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి.. నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకొని వారి వేలిముద్రలతో కొత్త సిమ్‌లు తీసుకుంటున్నారు. ఇంటర్‌ నెట్‌ను ఉచితంగా ఇస్తామంటూ ఆశచూపి అమాయకుల పేర్ల మీద సిమ్‌ కార్డులు సృష్టిస్తున్నారు. తమకు ఎన్ని సిమ్‌లు అమ్మితే అంత కమీషన్‌తో పాటు సైబర్‌ నేరగాళ్ల నుంచి అఽధిక మొత్తంలో డబ్బులు వస్తుండటంతో వారు ఈ దందాకు సహకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇలా అక్రమంగా యాక్టివేట్‌ చేసిన సిమ్‌ కార్డులను సైబర్‌ నేరగాళ్లు ఈ-సిమ్‌లుగా మార్చి, విదేశాల్లోని సైబర్‌ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. తద్వారా ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్‌ కార్డు లేకుండానే, మన దేశ మొబైల్‌ నంబర్లను తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నారు. ఇండియన్‌ నంబర్లతో వాట్సాప్‌, టెలిగ్రామ్‌ ఖాతాలు తెరవడంతో పాటు.. మ్యాట్రిమోనియల్‌ సైట్లు, ప్రముఖ డేటింగ్‌ యాప్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్‌ సృష్టిస్తున్నారు. అమాయకులకు వల వేసి, వారి నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. నగ్న వీడియో కాల్స్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసే ‘సెక్స్‌టార్షన్‌’ ముఠాలు.. సీబీఐ, పోలీసులమంటూ భయపెట్టే ‘డిజిటల్‌ అరెస్ట్‌’ ముఠాలు ఈ నంబర్లనే వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నంబర్‌ మన దేశానిదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారని సీపీ వెల్లడించారు.


టార్గెట్‌ పూర్తి కాగానే..

ఈ ఘోస్ట్‌ సిమ్‌ కార్డుల దందా మొత్తం పక్కా వ్యూహంతో, ప్రణాళికతో జరుగుతోంది. లోకల్‌ ఏజెంట్లు ఇలా పెద్ద సంఖ్యలో సిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేసి, తమ టార్గెట్‌ పూర్తికాగానే రాత్రికి రాత్రే దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్నట్లు తేలింది. కాగా,’ఘోస్ట్‌ సిమ్‌’ నెట్‌వర్క్‌ వ్యవహారాన్ని సీరియ్‌సగా తీసుకున్న హైదరాబాద్‌ సిటీ పోలీసులు త్వరలోనే ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌-ఐడియా ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. అలాగే, డీవోటీ, ట్రాయ్‌ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి.. నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేసి, పాయింట్‌ ఆఫ్‌ ేసల్‌ ఏజెంట్లపై నిఘా పెట్టి ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని కోరనుంది. కాగా.. ‘‘మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్‌ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌ సంచార్‌ సాఽథీ ద్వారా వెంటనే చెక్‌ చేసుకోండి. ఈ ‘సంచార్‌ సాథీ’ పోర్టల్‌ను క్రమంతప్పకుండా తనిఖీ చేస్తూ, మీకు తెలియకుండా ఎవరైనా మీ నంబర్‌ను వాడుతుంటే వెంటనే అందులోనే రిపోర్ట్‌ చేసి బ్లాక్‌ చేయొచ్చ’’ని సీపీ సజ్జనార్‌ ప్రజలకు సూచించారు.

Updated Date - May 21 , 2026 | 03:31 AM