మూడేళ్ల బాలికపై అత్యాచారం
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:24 AM
మూడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ యువకుడికి రాజేంద్రనగర్ పోక్సో కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధించింది.
కరాటే మాస్టర్‌కు 20 ఏళ్ల జైలు
2019లో లైంగికదాడి
స్కూల్ భవనంపైన ఉన్న రూమ్‌లో అఘాయిత్యం
సాక్ష్యాలను తారుమారుకు యత్నించిన మహిళా ప్రిన్సిపల్‌కు మూడేళ్ల జైలు
రాజేంద్రనగర్/హైదరాబాద్‌సిటీ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): మూడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ యువకుడికి రాజేంద్రనగర్ పోక్సో కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధించింది. ఈ మేరకు కోర్టు న్యాయమూర్తి టి. శ్రీనివాస్ గురువారం తీర్పునిచ్చారు. 2019లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వెలువరించిన తీర్పు వివరాలను గురువారం స్పెషల్ పబ్లిక్ పాస్యిక్యూటర్ బి వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. మియాపూర్ దీప్తి శ్రీనగర్‌కు చెందిన కుర్ర కిరణ్ సాయి (24) స్థానికంగా ఓ ప్లే స్కూల్‌లో జిమ్నాస్టిక్స్ అండ్ కరాటే కోచ్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్లే స్కూల్‌లో చేరిన మూడున్నరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి బిల్డింగ్‌పైకి తీసుకెళ్లాడు. జిమ్నాస్టిక్ రూమ్‌లో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప బిగ్గరగా ఏడవడంతో అక్కడి నుంచి తీసుకొచ్చి వదిలేసి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన చిన్నారి తాను స్కూల్‌కు వెళ్లనంటూ మారాం చేసింది. తనపై జరిగిన దారుణాన్ని వాళ్ల అమ్మమ్మతో బాలిక చెప్పడంతో ఘటన వెలుగులోకొచ్చింది. ఈ విషయమ్మీద పాప తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపల్ దీపికను నిలదీయగా అలాంటిదేమీ జరగలేదని బుకాయించింది. కరాటే మాస్టర్ చేసిన తప్పు తెలిసి కూడా విషయం దాచిపెట్టింది. దాంతో బాధితులు పోలీసులకు పిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో ప్రిన్సిపల్‌కు అన్ని తెలిసీ సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిందని గుర్తించారు. చార్జిషీట్ ఫైల్ చేసిన పోలీసులు న్యాయస్థానానికి సమర్పించారు. రాజేంద్రనగర్ పోక్సో న్యాయస్థానంలో కేసు బుధవారం విచారణకు రావడంతో సాక్ష్యాధారాలను, కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి, నిందితుడు కిరణ్ సాయిని దోషిగా నిర్ధారించి తీర్పు వెలువరించారు. బాలిక కుటుంబానికి రూ. 3 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.