బాలికపై లైంగిక దాడి.. వేధింపులు
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:35 AM
పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమె నగ్న వీడియోలు తీసి వేధింపులుకు గురిచేసిన...
నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగారం
హైదరాబాద్ సిటీ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమె నగ్న వీడియోలు తీసి వేధింపులుకు గురిచేసిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 16 వేల జరిమానా విధించింది. ఈ మేరకు నాంపల్లి 12వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి శనివారం తీర్పును వెలువరించారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌కు చెందిన గుమ్ముల నాగరాజు(19) ఓ బాలిక(16)కు ప్రేమ పేరుతో దగ్గరై పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో దానిని తొలగించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించి బాలికను తన అదుపులో ఉంచుకున్నాడు. 2019 మార్చి 2న బాలికను కిడ్నాప్ చేసి వేధింపులకు గురిచేశాడు. చివరికి నాగరాజు చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు గాంధీనగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తి సాక్ష్యాధారాలతో చార్జ్‌షీట్ ధాఖలు చేయడంతో కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది.