మద్యం మత్తులో మృగమై..భార్య, ఇద్దరు పిల్లలపై రోకలితో దాడి
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:24 AM
మద్యం మత్తులో ఓ వ్యక్తి మృగంలా మారాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో విచక్షణ కోల్పోయి.. భార్య, నిద్రలో ఉన్న తన ఇద్దరు పిల్లలను రోకలితో కొట్టాడు.
కుటుంబకలహాల నేపథ్యంలో భర్త ఘాతుకం
భార్య, ఆరేళ్ల కుమారుడి మృతి, ఆస్పత్రిపాలైన కుమార్తె
రంగారెడ్డి జిల్లా పులిగోనితండాలో ఘటన
ఆమనగల్లు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఓ వ్యక్తి మృగంలా మారాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో విచక్షణ కోల్పోయి.. భార్య, నిద్రలో ఉన్న తన ఇద్దరు పిల్లలను రోకలితో కొట్టాడు. ఈ దెబ్బకు భార్యతోపాటు ఆ పిల్లల్లోని ఆరేళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోగా.. కుమార్తె ఆస్పత్రిపాలైంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం పులిగోనిపల్లి తండాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పులిగోనిపల్లి తండాకు చెందిన బాణావత్ రాందా్‌సనాయక్‌కు రాంనుంతల తండాకు చెందిన కవిత(32)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పావని(12), పవిత్ర(10), ప్రణీత(8), హర్ష(6) అనే పిల్లలు ఉన్నారు. రాందా్‌సనాయక్ ఆమనగల్లు సూర్యలక్ష్మి కాటన్ మిల్లులో కార్మికుడు కాగా అనిత కూలి పనులకు వెళ్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుంది. పవిత్ర, పావని ఆమనగల్లులో ఓ హాస్టల్ ఉంటూ చదువుకుంటున్నారు. ఇందులో పవిత్ర.. రాందా్‌సనాయక్ పక్కింటిలోనే ఉంటున్న తమ నాయనమ్మ ఇంట్లో ప్రస్తుతముంది. ప్రణీత, హర్ష మాత్రం తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. అయితే, మద్యానికి బానిసైన రాందా్‌సనాయక్.. మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిత్యం భార్యతో గొడవ పడుతుండేవాడు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి ఆలస్యంగా రాగా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన రాందా్‌సనాయక్.. రోకలితో భార్య కవితను కొట్టాడు. అనంతరం అక్కడే నిద్రలో ఉన్న కుమారుడు హర్ష, కూతురు ప్రణీతను కూడా బాదాడు. పక్కింట్లో ఉన్న రాందా్‌సనాయక్ తల్లి, కూతురు పవిత్ర మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి కవిత, హర్ష, ప్రణీతలు రక్తపుమడుగులో పడి ఉన్నారు. దీంతో జరిగిన ఘోరం బయటప్రపంచానికి తెలిసింది. అయితే, కవిత, హర్ష అప్పటికే ప్రాణాలు కోల్పోగా.. కొనఊపిరితో ఉన్న ప్రణీతను స్థానికులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రణీత పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కవిత సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు రాందా్‌సనాయక్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణీత వైద్య అవసరాలకోసం మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆడ బిడ్డల చదువులకు సహకారం అందిస్తానని తెలిపారు.