Share News

సొంతటి కలే ప్రాణం తీసింది

ABN , Publish Date - May 21 , 2026 | 03:55 AM

అప్పుచేసి ఫ్లాట్‌ కొన్న ఓ వ్యక్తి, ఆ డబ్బులు తిరిగిచ్చేయాలని రుణదాత గట్టిగా నిలదీయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

సొంతటి కలే ప్రాణం తీసింది

  • రెండేళ్ల క్రితం రూ.10లక్షలు అప్పు చేసి ఫ్లాట్‌ కొన్న వ్యక్తి

  • డబ్బులు తిరిగివ్వాలని నిలదీసిన వడ్డీ వ్యాపారి

  • మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

  • చంపాపేటలో ఘటన

సంతోష్‌నగర్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): అప్పుచేసి ఫ్లాట్‌ కొన్న ఓ వ్యక్తి, ఆ డబ్బులు తిరిగిచ్చేయాలని రుణదాత గట్టిగా నిలదీయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. చంపాపేట మారుతీనగర్‌లో ఈ ఘటన జరిగింది. ఐఎస్‌ సదన్‌ సీఐ నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం మారుతీనగర్‌లోని మారుతి ఎన్‌క్లేవ్‌లో జయరామ్‌ (45) అనే వ్యక్తి జిరాక్స్‌ షాపు నడుపుతున్నాడు. ఆయనకు భార్యాపిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం జయరామ్‌ ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొన్నాడు. ఇందుకు శ్రీధర్‌ రెడ్డి అనే వడ్డీ వ్యాపారి నుంచి రూ.10 లక్షలు అప్పు చేశాడు. గడువు ముగిసినా జయరామ్‌ అప్పు తీర్చకపోవడంతో తన వద్ద తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయాలంటూ శ్రీధర్‌ రెడ్డి గట్టిగా నిలదీశాడు. తీవ్ర మనస్తాపానికి గురైన జయరామ్‌ జిరాక్స్‌ షాపులో మంగళవారం రాత్రి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో జయరామ్‌ భార్యాపిల్లలు ఆందోళన చెందా రు. కూతురు జయశ్రీ జిరాక్స్‌ సెంటర్‌ వద్దకు వెళ్లి చూడగా జయరామ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. తీవ్ర షాక్‌కు గురైన జయశ్రీ, ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జయరామ్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - May 21 , 2026 | 03:55 AM