Share News

స్టాక్‌ మార్కెట్‌లో అధిక లాభాల ఆశ చూపి..ఐటీ ఉద్యోగికి రూ.37.36 లక్షల టోకరా

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:57 AM

స్టాక్‌ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని, తాము సెబీ సర్టిఫైడ్‌ అనలిస్టులమని నమ్మించి ఓ సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని రూ.37.36 లక్షల మేర మోసం ...

స్టాక్‌ మార్కెట్‌లో అధిక లాభాల ఆశ చూపి..ఐటీ ఉద్యోగికి రూ.37.36 లక్షల టోకరా

  • సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌లో కేసు నమోదు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): స్టాక్‌ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని, తాము సెబీ సర్టిఫైడ్‌ అనలిస్టులమని నమ్మించి ఓ సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని రూ.37.36 లక్షల మేర మోసం చేసిన ఘటన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గౌలిదొడ్డిలోని శ్రీ సాయి హౌసింగ్‌ కాలనీలో నివాసం ఉంటూ సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న బాధితుడు 2022 నుంచి గ్రో యాప్‌, 2026లో ధన్‌ యాప్‌ ద్వారా ఈక్విటీ ట్రేడింగ్‌ చేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో స్టాక్‌ వైజ్‌ డాట్‌ ఇన్‌, సాల్విటాన్‌ ఎనలిటిక్స్‌, ఎస్‌వీ స్టాక్‌ రీసెర్చ్‌, ఏవీ రీసెర్చ్‌ పేర్లతో పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులు అతడికి ఫోన్‌ చేశారు. తాము సెబీ గుర్తింపు పొందిన అనలిస్టులమని, 97 నుంచి 100 శాతం వరకు లాభాలు వచ్చే స్టాక్‌ సూచనలు ఇస్తామని హామీ ఇచ్చారు. బిలాల్‌, మయాంక్‌ అనే వ్యక్తులు వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా బాధితుడిని సంప్రదించి ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించారు. మొదట రూ.20 వేల చొప్పున పెట్టుబడులు పెట్టించి స్వల్ప లాభాలు చూపించారు. ఇలా నమ్మకాన్ని కలిగించి బాధితుడితో పలు విడతల్లో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టించారు. కొద్ది సమయంలోనే సుమారు రూ.21 లక్షల మేర ట్రేడింగ్‌ నష్టం సంభవించింది. అయితే నష్టాన్ని పూడ్చుకోవాలంటే మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారు ఒత్తిడి చేశారు. దీంతో బాధితుడు అప్పులు చేసి మరో రూ.10.84లక్షలు పెట్టుబడులు పెట్టాడు. చివరకు మొత్తం రూ.37,36,341 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించి సెబీకి ఫిర్యాదు చేయగా, రూ.2.87 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించినట్లు బాధితుడు తెలిపాడు. ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నాడు.

Updated Date - Jun 30 , 2026 | 04:57 AM