విడాకుల కేసు వేసిందని భార్యను చంపాడు!
ABN , Publish Date - May 20 , 2026 | 04:03 AM
తనపై కోర్టులో విడాకుల కేసు వేసిందని భార్యపై కక్ష పెంచుకున్న భర్త పథకం ప్రకారం ఆమెను కత్తితో పొడిచి చంపాడు.
హైదరాబాద్ కవాడిగూడలో భర్త ఘాతుకం
ఆటోలో విధులకు వెళుతున్న ఆమెను వెంబడించి కత్తితో దాడి
కవాడిగూడ, మే 19 (ఆంధ్రజ్యోతి): తనపై కోర్టులో విడాకుల కేసు వేసిందని భార్యపై కక్ష పెంచుకున్న భర్త పథకం ప్రకారం ఆమెను కత్తితో పొడిచి చంపాడు. గాంధీనగర్ పరిధిలోని కవాడిగూడలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సీఐ బోస్ కిరణ్, హతురాలి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. అత్తాపూర్ పరిధిలోని కిషన్‌బాగ్ ఎంఎన్‌గూడ కాలనీలో నివాసం ఉంటే అప్షలం, లలిత అలియాస్ పద్మ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో దెబోరా (25) నాలుగో కుమార్తె. వీరి పూర్వీకులది ఏపీలోని కర్నూలు. చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కొచ్చి ఉంటున్నారు. కిషన్‌బాగ్ ఎంన్‌గూడలోనే నివాసం ఉండే బంగి రాజు(29) ట్రాలీఆటో డ్రైవర్! దెబోరా-రాజు ప్రేమించుకొని 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. చాన్నాళ్లుగా దెబోరా-రాజు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర క్రితం భర్త రాజు తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ దెబోరా, అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో భర్త రాజు నుంచి విడాకులు కోరుతూ అప్పట్లోనే ఫ్యామిలీ కోర్టులో ఆమె కేసు వేసింది. ప్రస్తుతం ఆ కేసు విచారణకొచ్చింది. భార్యపై కక్ష పెంచుకున్న రాజు, ఆమెను ఎలాగైనా చంపాలనుకున్నాడు. తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన దెబోరా తల్లిదండ్రులతో కలిసి అత్తాపూర్ పీఎస్ పక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటోంది. ఆమె కవాడిగూడ మెయిన్‌రోడ్‌లోని ఓ సెలూన్ అండ్ స్పాలో బ్యూటిషియన్‌గా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం ఆటోలో కవాడిగూడలోని సెలూన్, స్పా సెంటర్‌కు బయలుదేరిన దెబోరాను రాజు ద్విచక్రవాహనంపై వెంబడించాడు. ఉదయం పదిన్నరకు ఆటో దిగిన దెబోరా స్పాసెంటర్‌లోకి వెళుతుండగా ఆమెను రాజు అడ్డగించి.. గొడవకు దిగాడు. గమనించిన ఇద్దరు యువకులు.. అతడిని అడ్డుకొనే ప్రయత్నం చేయగా వారిని కత్తితో బెదిరించాడు. లిఫ్ట్ నాలుగో అంతస్తుకు చేరగానే దెబోరా-రాజు మధ్య గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న కత్తితో దెబోరా పొట్ట, మెడ భాగంలో రాజు విచక్షణారహితంగా పొడిచాడు. ఈఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం రాజు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.