Share News

హైదరాబాద్‌లో అదృశ్యం.. ఏపీలో మృతదేహం

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:02 AM

హైదరాబాద్‌లో గత నెల 27న అదృశ్యమైన ఇంజనీరింగ్‌ విద్యార్థి అంకం రాహుల్‌ (21) ఆంధ్రప్రదేశ్‌లోని సింగరాయకొండలో విగత జీవిగా తేలాడు.

హైదరాబాద్‌లో అదృశ్యం.. ఏపీలో మృతదేహం

  • ఇంజనీరింగ్‌ విద్యార్థి మిస్సింగ్‌ కేసు విషాదాంతం

  • మే 27న కాచిగూడలో అదృశ్యమైన రాహుల్‌

  • 31న ఏపీలోని సింగరాయకొండలో బావిలో మృతదేహం లభ్యం

  • గుర్తుతెలియని శవంగా భావించి ఖననం చేసిన అక్కడి పోలీసులు

  • కాచిగూడ పోలీసుల వీడియో చూసి గుర్తుపట్టిన ఏపీ పోలీసులు

  • మృతదేహాన్ని వెలికితీసి డీఎన్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు

హైదరాబాద్‌ సిటీ/బర్కత్‌పుర/కోరుట్ల రూరల్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో గత నెల 27న అదృశ్యమైన ఇంజనీరింగ్‌ విద్యార్థి అంకం రాహుల్‌ (21) ఆంధ్రప్రదేశ్‌లోని సింగరాయకొండలో విగత జీవిగా తేలాడు. సింగరాయకొండ రైల్వేస్టేషన్‌ సమీపంలోని వ్యవసాయ బావిలో గత నెల 30న అతడి మృతదేహం లభించింది. జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాజేశ్వర్‌ కుమారుడు అంకం రాహుల్‌ హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఒక హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నాడు. అతడు గత నెల 27న కాచిగూడ రైల్వేస్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ లేకపోవటంతో తన కుమారుడు కనిపించడంలేదని అంకం రాజేశ్వర్‌ మే 31న కాచిగూడ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా అతడు శబరి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కుతున్న వీడియో లభించింది. కానీ, ఎక్కడికి వెళ్లాడన్నది తెలియలేదు. కాగా, సింగరాయకొండ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఒక వ్యవసాయ బావిలో గత నెల 30న శవం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, ఈ నెల 2వ తేదీవరకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా భావించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఖననం చేశారు. రాహుల్‌ కనిపించటం లేదని అతడి కుటుంబ సభ్యులతో కాచిగూడ పోలీసులు ఒక వీడియో రికార్డు చేసిపోలీసుల సోషల్‌మీడియా గ్రూపుల్లో వేశారు. అది చూసిన సింగరాయకొండ పోలీసులు.. బావిలో దొరికిన శవం రాహుల్‌దిగా గుర్తించారు. సింగరాయకొండ సీఐ శ్రీహరి.. కాచిగూడ సీఐ రాజశేఖర్‌తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కాచిగూడ పోలీసులు ఈ విషయాన్ని మృతుని తల్లిదండ్రులకు తెలిపి, వారిని సింగరాయకొండకు తీసుకెళ్లారు. ఖననం చేసిన రాహుల్‌ మృతదేహాన్ని బయటకు తీసి డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిర్థారణ చేయాల్సి ఉందని సీఐ రాజశేఖర్‌ తెలిపారు.


ఆత్మహత్యా..? హత్యా..?

రాహుల్‌ మృతదేహం లభ్యమైనప్పుడు అతడి నడుముకు రాయి కట్టి ఉందని పోలీసులు తెలిపారు. దీంతో అతడిది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. కాలేజీలో అతడు తోటి విద్యార్థినిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక కాలేజీలో ర్యాగింగ్‌వల్ల అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. రాహుల్‌ మృతితో అతడి స్వగ్రామం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో విషాదం నెలకొంది.

Updated Date - Jun 09 , 2026 | 05:10 AM