Share News

ఆభరణాల కోసం వృద్ధ మహిళల హత్య

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:53 AM

పదిహేను రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌, జూబ్లీహిల్స్‌ పరిధిలో నమోదైన ఇద్దరు వృద్ధ మహిళల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు.

ఆభరణాల కోసం వృద్ధ మహిళల హత్య

  • 3 రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలను గొంతుకు ఉరి బిగించి హతమార్చిన నిందితుడు

  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి వరుస హత్యలు

  • జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌లో అదృశ్యం కేసులను ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్టు

బంజారాహిల్స్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పదిహేను రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌, జూబ్లీహిల్స్‌ పరిధిలో నమోదైన ఇద్దరు వృద్ధ మహిళల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఆభరణాల కోసం ఓ నిందితుడు వారిని హత్య చేసినట్లు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిలింనగర్‌కు చెందిన యాదమ్మ (79), జూబ్లీహిల్స్‌కు చెందిన మంగమ్మ అనే వృద్ధ మహిళలు ఈ నెల 13, 15 తేదీల్లో అదృశ్యమయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నార్సింగి శివారు లో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం యాదమ్మదేనని గుర్తించారు. సీసీ పుటేజీలు పరిశీలించగా ఆమె ఓ యువకుడితో ద్విచక్ర వాహనంపై వెళ్లినట్టు నిర్ధారణ అయింది. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా చెన్నగోలపాలేనికి చెందిన కునసాయి వాసు (29) నాలుగేళ్ల క్రితం భార్యతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి జూబ్లీహిల్స్‌లో ఓ వైద్యు డి వద్ద డ్రైవర్‌గా చేరాడు. భార్య పుట్టింటికి వెళ్లగా వాసు ఆన్‌లైన్‌ జూదానికి అలవాటు పడ్డాడు. ఉన్నదంతా పోగొట్టుకోవడంతో డబ్బుకోసం ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం అద్దెఇంటి కోసం వెతికిన వాసుకు యాదమ్మతో పరిచయం ఏర్పడింది. ఈ నెల 13న లిఫ్టు ఇస్తానని చెప్పి యాదమ్మ ను ద్విచక్ర వాహనం ఎక్కించుకున్న వాసు.. కొద్ది దూరం వెళ్లాక ఆమెను కారులో ఎక్కించుకుని నార్సింగి ఔటర్‌ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తాడును ఆమె గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. చెవికమ్మ లు, వెండి కడాలు తీసుకొని మృతదేహాన్ని అక్కడే పడేశాడు. అనంతరం తన ఎదురింట్లో మంగమ్మను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ నెల 15న ఆమెనూ అదే రకంగా హత్యచేసి ఆభరణాలు, పర్సులోఉన్న 16వేల నగదు తీసుకుని, మృతదేహాన్ని మోకిలా వద్ద పడేసి వచ్చాడు.

ఏమీ తెలియనట్టు.. కలివిడిగా ఉంటూ..

రెండు హత్యలు చేసినా వాసు అసలు ఏమీ జరగన్నట్టు, తనకేమీ తెలియనట్లు అందరితో కలివిడిగా మాట్లాడేవాడు. మం గమ్మ అదృశ్యం గురించి తెలిసి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించాడు.

Updated Date - Mar 31 , 2026 | 05:53 AM