Share News

బాలుడి హత్య.. ట్రాన్స్‌జెండర్‌కు ఉరిశిక్ష

ABN , Publish Date - May 13 , 2026 | 04:22 AM

చిట్టీ డబ్బులు ఎగొట్టేందుకు ఎనిమిదేళ్ల బాలుడిని హత్య చేయడమే కాక మృతదేహాన్ని నాలాలో పారేసిన ఇమ్రాన్‌ అనే ట్రాన్స్‌జెండర్‌కు న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది.

బాలుడి హత్య..  ట్రాన్స్‌జెండర్‌కు ఉరిశిక్ష

  • చిట్టీ డబ్బు ఎగ్గొట్టేందుకు ఎనిమిదేళ్ల చిన్నారిని చంపి..

  • మరొకరి సాయంతో మృతదేహాన్ని నాలాలో పారేసిన వైనం

  • 2023 ఏప్రిల్‌లో ఘటన, నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు

అమీర్‌పేట, మే 12(ఆంధ్రజ్యోతి): చిట్టీ డబ్బులు ఎగొట్టేందుకు ఎనిమిదేళ్ల బాలుడిని హత్య చేయడమే కాక మృతదేహాన్ని నాలాలో పారేసిన ఇమ్రాన్‌ అనే ట్రాన్స్‌జెండర్‌కు న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. అలాగే, బాలుడి మృతదేహాన్ని నాలాలో పారేసేందుకు సహకరించిన ఆటో డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష వేసింది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2023లో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి మేడ్చేల్‌-మల్కాజ్‌గిరి మూడో అదనపు కోర్టు జడ్జి మండవ వెంకటేశ్వర రావు మంగళవారం తీర్పు వెలువరించారు. అల్లావుద్దీన్‌ కోఠిలో నివాసముండే అబ్దుల్‌ వసీం ఖాన్‌ కుమారుడు అబ్దుల్‌ వహీద్‌ ఖాన్‌ (8)ను 2023 ఏప్రిల్‌ 20న ట్రాన్స్‌జెండర్‌ ఇమ్రాన్‌ అలీ ఖాన్‌ అలియాస్‌ ఫిజా(33) హత్య చేశాడు. చాక్లెట్‌ ఇస్తానని వహీద్‌ను ఇంట్లోకి తీసుకెళ్లిన ఇమ్రాన్‌.. కత్తితో బాలుడి గొంతు కోసి ప్రాణం తీశాడు. చిట్టీ వ్యవహారంలో వివాదమే హత్యకు కారణంగా పోలీసు దర్యాప్తులో తేలింది. వసీంఖాన్‌ బావ ఆసిమ్‌.. ఇమ్రాన్‌ వద్ద రూ.5 లక్షల చిట్టీ వేశాడు. అందులో రూ.లక్ష ఇచ్చిన ఇమ్రాన్‌ మిగిలిన రూ.4లక్షలు ఇవ్వకుండా ఆలస్యం చేశాడు. వసీంఖాన్‌ ఒత్తిడి తెస్తుండడంతో రగిలిపోయిన ఇమ్రాన్‌.. వసీం ఖాన్‌ కుమారుడు వహీద్‌ను హత్య చేశాడు. హత్య అనంతరం వహీద్‌ మృతదేహాన్ని ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి మహ్మద్‌ రఫీక్‌(32) అనే ఆటో డ్రైవర్‌ సహాయంతో తరలించిన ఇమ్రాన్‌.. ఆ మృతదేహాన్ని ఫతేనగర్‌ పరిధిలోని దీన్‌దయాల్‌ నాలాలో పారేశాడు. అయితే, బాలుడి అదృశ్యంపై అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన సనత్‌నగర్‌ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారం ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. హత్య విషయం వెలుగు చూసింది. పోలీసులు పూర్తి ఆధారాలతో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయమూర్తి ప్రధాన నిందితుడు ఇమ్రాన్‌కు ఉరి శిక్ష, ఆటో డ్రైవర్‌ రఫీక్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. కాగా, ఈ తీర్పు వహీద్‌ తండ్రి వసీంఖాన్‌ హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందంటూ న్యాయస్థానానికి, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - May 13 , 2026 | 04:22 AM