Share News

లాకర్లు బద్దలు కొడితే కట్టలు, నగలు రాలాయ్‌!

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:56 AM

ల్యాండ్‌ అండ్‌ సర్వే విభాగం డిప్యూ టీ డైరక్టర్‌ నరహరి కేసు అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే అతిపెద్ద అక్రమార్జన కేసుగా నిలిచింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో....

లాకర్లు బద్దలు కొడితే కట్టలు, నగలు రాలాయ్‌!

  • కళ్లుచెదిరే నరహరి అక్రమార్జన

హైదరాబాద్‌/చాంద్రాయణగుట్ట, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ల్యాండ్‌ అండ్‌ సర్వే విభాగం డిప్యూ టీ డైరక్టర్‌ నరహరి కేసు అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే అతిపెద్ద అక్రమార్జన కేసుగా నిలిచింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టయిన నరహరికి చెందిన రెండు బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు శనివారం బద్దలు కొట్టారు. ఒక లాకర్‌లో రూ.1.5 కోట్ల విలువైన నోట్లకట్టలు బయటపడటంతో ఏసీబీ అధికారులు నిర్ఘాంతపోయారు. అన్నీ రూ.500 నోట్లతో కూడిన 300కట్టలు ఒక లాకర్‌లో కుక్కేశారని ఏసీబీ అధికారులు వెల్లడించారు. మరో లాకర్‌ను తెరిచి చూస్తే అందులో బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. 12 బంగారు బిస్కెట్లు సహా మొత్తంగా 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఈ లాకర్‌లో ఏసీబీ అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈనెల 16న నరహరి ఇంట్లో, ఆయన బంధువుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో నగదు, ఆభరణాలు, డిపాజిట్‌ పత్రాలు కలిపి రూ.13.05 కోట్ల మేర ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో ఎన్నో రెట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. అదేరోజు నరహరి కుటుంబసభ్యుల పేరిట శాలిబండ కెనరాబ్యాంకులో రెండు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లాకర్‌ తాళం చెవులు కన్పించడం లేదని, నరహరి ఆయన కుటుంబసభ్యులు చెప్పడంతో నరహరిని 17న రిమాండ్‌కు తరలించిన తర్వాత లాకర్లు తెరవడం కోసం న్యాయస్ధానంలో సెర్చ్‌వారంట్‌ పిటిషన్‌ను ఏసీబీ అధికారులు దాఖలు చేశారు. కోర్టు నుంచి అనుమతి రావడంతో శనివారం లాకర్లను ఏసీబీ అధికారులు బద్దలు కొట్టి తెరిచారు. నరహరి కేసుకు సంబంధించి ఇప్పటివరకు రూ.3.04కోట్ల నగదును, రూ.5.04కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాలను ఏసీబీ అధికారుల సీజ్‌ చేశారు. బ్యాంకు బ్యాలెన్స్‌ రూ.2.29కోట్లను ఫ్రీజ్‌ చేయించారు.


1987లో రూ.700 జీతంతో సర్వీసులోకి

సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సుంకరి నరహరి రావు 1987లో మండల సర్వేయర్‌గా నెలకు రూ.700 వేతనంతో సర్వీసులో చేరారు. పాతబస్తీలో ఒక పాత ఇల్లు ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. నరహరికి భార్య వందనతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు నితిన్‌సాయి ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాడు. కుమార్తె వివాహం 2022లో నరహరి అత్యంత ఘనంగా జరిపారు. ల్యాండ్‌ సర్వే విభాగంలో అవినీతికి పాల్పడటం ద్వారా నరహరి అక్రమాస్తులను కూడబెట్టినట్లు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు ఆయనపై కొన్నాళ్లుగా నిఘాపెట్టారు. ఈ నెల 12న ఏసీబీ సిటీ రేంజ్‌ 2 ఇన్‌స్పెక్టర్‌ మసియుద్దీన్‌.. సుంకరి నరహరికి సంబంధించిన అక్రమ ఆదాయంపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఏసీబీ ఉన్నతాధికారులకు నివేదిక అందచేశారు. 15న నరహరిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, 16న ఏకకాలంలో సోదాలు నిర్వహించి నరహరి ఆస్తుల చిట్టాను బట్టబయలు చేశారు. ఏసీబీ అధికారులు న్యాయస్ధానంలో దాఖలు చేసిన ప్రాథమిక విచారణ నివేదిక ప్రకారం 1987 నుంచి ఈనెల 12వ తేది వరకు నరహరి ఆదాయం రూ.1.60 కోట్లు, ఖర్చులు రూ.1,01,33,333 కాగా ఆయనకు మిగలాల్సిన సేవింగ్స్‌ రూ.58,66,333 మాత్రమే! కానీ ప్రాథమిక విచారణ నాటికే ఏసీబీ గుర్తించిన నరహరి ఆర్జన రూ.3,67,69,400. ఇందులో సేవింగ్స్‌ మినహయిస్తే రూ.3,09,02,733 అక్రమార్జనకు నరహరి పాల్పడ్డారని, దీంతో ఆయనపై కేసు నమోదు చేశామని ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేశారు. నరహరి కేసు విచారణ కొనసాగుతోందని ఆయన్ను త్వరలోనే కస్టడీకి తీసుకుని విచారణ చేస్తామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.

Updated Date - Jun 21 , 2026 | 04:56 AM