Share News

పోలీసు సమక్షంలోనే భార్యను చంపాడు

ABN , Publish Date - Apr 07 , 2026 | 06:00 AM

తనను, పిల్లలను వదిలేసి భార్య ప్రియుడితో వెళ్లిపోయిందన్న కోపంతో ఆమెపై కక్ష పెంచుకున్న భర్త.. పోలీసు సమక్షంలోనే ఆమె గొంతు కోసి దారుణంగా చంపేశాడు..

పోలీసు సమక్షంలోనే భార్యను చంపాడు

  • సదాశివపేటలో ఘటన.. ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌తో వెళ్లిపోయిన భార్య

  • జడ్చర్లలో ప్రియుడితో ఉన్నట్లు గుర్తింపు.. కానిస్టేబుల్‌తో అక్కడికి భర్త

  • భార్యాభర్తల మధ్య గొడవ.. అంతా కలిసి కారులో జహీరాబాద్‌కు

  • డ్రైవర్‌ పక్క సీటులో కానిస్టేబుల్‌, వెనుక సీటులో భర్త, భార్య, ప్రియుడు

  • అదును చూసి కత్తితో భార్య కవిత గొంతు కోసిన భర్త సిద్ధారెడ్డి

జహీరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): తనను, పిల్లలను వదిలేసి భార్య ప్రియుడితో వెళ్లిపోయిందన్న కోపంతో ఆమెపై కక్ష పెంచుకున్న భర్త.. పోలీసు సమక్షంలోనే ఆమె గొంతు కోసి దారుణంగా చంపేశాడు.. భార్యను వెతికేందుకు కానిస్టేబుల్‌తో కలిసి అతడు కారులో వెళ్లగా.. ప్రియుడితో ఆమె దొరికిపోయింది. దీనికి సంబంధించి స్థానిక ఠాణాలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే భార్య, ఆమె ప్రియుడు, భర్తను మొదట ఫిర్యాదు చేసిన ఠాణాకు కారులో తీసుకొస్తుండగా.. భర్త తన వద్ద దాచుకున్న కత్తితో భార్య గొంతు కోశాడు. సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంటి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జహీరాబాద్‌, జడ్చర్ల పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్య జరిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారు ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా ఓ ప్రాణం దక్కేదని అంటున్నారు. జహీరాబాద్‌ సీఐ శివలింగం వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం తుమ్మాన్‌పల్లికి చెందిన సిద్ధారెడ్డికి కవిత(30)తో 12 ఏళ్ల కింద వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడున్నారు. జహీరాబాద్‌లోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో సిద్ధారెడ్డి కుటుంబంతో నివాసముంటూ చిరు వ్యాపారం చేస్తున్నాడు. కవిత ఇంట్లోనే టైలరింగ్‌ పని చేస్తుండేది. అయితే కవితకు ఫేస్‌బుక్‌లో పవన్‌కుమార్‌రెడ్డితో కొన్నాళ్ల కింద పరిచయం ఏర్పడింది. దీంతో గత నెల 27న పవన్‌తో కలిసి ఆమె మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే సిద్ధారెడ్డి గత నెల 30న జహీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు.. కవిత జడ్చర్లలో ప్రియుడు పవన్‌తో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను తిరిగి తీసుకువచ్చేందుకు పోలీసులతో పాటు సిద్ధారెడ్డి కూడా సోమవారం కారులో జడ్చర్లకు వెళ్లాడు. భార్య, ఆమె ప్రియుడు, సిద్ధారెడ్డి కారులో వెనక సీట్లో కూర్చొగా.. ముందు సీట్లో ఓ కానిస్టేబుల్‌, డ్రైవర్‌ ఉన్నారు. అయితే కారు నందికంది దగ్గరకు రాగానే అప్పటికే తన వద్ద ఉన్న కత్తితో సిద్ధారెడ్డి భార్య గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని జహీరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడైన సిద్ధారెడ్డిని రిమాండ్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్‌ పోలీసులు వివరించారు. తల్లి హత్యకు గురి కావడం.. తండ్రి జైలుకు వెళ్లడంతో వారి ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.


పోలీసుల నిర్లక్ష్యంతోనే..!

ఓ కానిస్టేబుల్‌ సమక్షంలోనే జరిగిన ఈ హత్య ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జడ్చర్లలో కవిత, పవన్‌ ఉన్నట్లు గుర్తించిన జహీరాబాద్‌ పోలీసులు.. తొలుత పవన్‌కు ఫోన్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించినట్లు తెలిసింది. అయితే కవిత తనవద్దే ఉందని, తాను జహీరాబాద్‌ రానని అతడు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓ కానిస్టేబుల్‌తో కలిసి సిద్ధారెడ్డి కారులో జడ్చర్లకు వెళ్లాడు. వారు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అక్కడి ఠాణాలో కవిత, సిద్ధారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు సిద్ధారెడ్డిని బయట వేచి ఉండమని చెప్పడంతో ఠాణా బయటకు వచ్చిన అతడు.. దగ్గరలో కూరగాయలు కోసే కత్తిని కొనుగోలు చేసి తన వద్ద దాచుకున్నాడు. తర్వాత సిద్ధారెడ్డి, కవిత, పవన్‌.. కారు వెనక సీటులో కూర్చొగా.. కానిస్టేబుల్‌, డ్రైవర్‌ ముందు సీట్లో ఉన్నారు. ఈ క్రమంలోనే కారు నందికంటి వద్దకు రాగానే కవితపై భర్త ఒక్కసారిగా దాడి చేసి గొంతు, తలపై పొడిచాడు. ముందు సీట్లో ఉన్న కానిస్టేబుల్‌ స్పందించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే జడ్చర్ల ఠాణాలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత భర్త కదలికలపై కన్ను వేయకపోవడం, కత్తి దాచుకున్న విషయాన్ని గమనించకపోవడం, వారిని పక్కపక్కనే కూర్చునేందుకు అనుమతించడంతోనే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 07 , 2026 | 06:58 AM