అలా కాదు.. ఇలా ఉరేసుకో
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:53 AM
తన వేధింపులతో మొదటి భార్యను అంతమొందించాడు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న రెండో భార్యనూ వేధింపులకు గురిచేశాడు.
భార్య ఫ్యాన్‌కు ఉరేసుకుంటుండగా వీడియో తీస్తూ ప్రోత్సహించిన భర్త
కడప జిల్లాలో దారుణం..
రాజంపేట, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తన వేధింపులతో మొదటి భార్యను అంతమొందించాడు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న రెండో భార్యనూ వేధింపులకు గురిచేశాడు. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే దగ్గరుండి చూస్తూ ప్రోత్సహించాడు. అతడి పైశాచిక ఆనందం వీడియోలో బహిర్గతమైంది. ఈ విషాద ఘటన వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలో జరిగింది. గురువారం భార్య ఆత్మహత్యకు పాల్పడగా.. భర్త తీసిన వీడియో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. రాజంపేట మండలం బోయనపల్లెలో శ్రీరామ శ్రీనివాసులు, భార్య కృష్ణవేణి నివాసం ఉంటున్నారు. శ్రీనివాసులు రైల్వేలో లోకోపైలట్‌గా పనిచేస్తున్నాడు. అతడికి గతంలో పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భర్త వేధింపులతో మొదటి భార్య చనిపోయింది. ఆరేళ్ల క్రితం కృష్ణవేణిని రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా భార్యను వేధిస్తున్నాడు. భర్త వేధింపులను కృష్ణవేణి తాళలేక గురువారం ఇంటిలోని గదిలోకి వెళ్లి ఫ్యానుకు చీరకట్టి ఉరివేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకుంటుండగా శ్రీనివాసులు కిటికీలోంచి తన ఫోన్లో వీడియో తీశాడు. ఉరి వేసుకునే సమయంలో ఎగతాళిగా ‘‘అలా ఏంది.. ఇలా చేసుకో’’ అంటూ ఉరివేసుకునేలా ఆమెను ప్రోత్సహించాడు. మన్నూరు పోలీసులు శ్రీనివాసులును గురువారమే అదుపులోకి తీసుకున్నారు. అతడి సెల్‌ఫోన్ పరిశీలించిన పోలీసులకు కృష్ణవేణి ఉరివేసుకున్న దృశ్యాలు కనిపించాయి.