Share News

భార్యను చంపి.. మృతదేహంతో సెల్ఫీ!

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:54 AM

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త పలుమార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వేధించాడు. చివరకు నిద్రిస్తున్న ఆమెను రోకలిబండతో మోది దారుణంగా చంపేశాడు.

భార్యను చంపి.. మృతదేహంతో సెల్ఫీ!

  • అనంతరం వాట్సాప్‌ స్టేట్‌సగా ఆ ఫొటో

  • అనుమానంతో ఇల్లాలిని కడతేర్చిన భర్త

  • నిద్రపోతుండగా రోకలితో మోది హత్య

యూసు్‌ఫగూడ/హైదరాబాద్‌ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానం పెంచుకున్న భర్త పలుమార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వేధించాడు. చివరకు నిద్రిస్తున్న ఆమెను రోకలిబండతో మోది దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె మృత దేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకుని ఇంట్లో నుంచి పరారయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన సరస్వతి(32)కి, వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన రొడ్డె ఆంజనేయులుతో 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కారు డ్రైవర్‌ అయిన ఆంజనేయులు బోరబండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజీవ్‌ గాంధీనగర్‌లో కుటుంబంతో ఉంటున్నాడు. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ ఆంజనేయులు తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో పలుమార్లు సరస్వతిపై దాడి చేశాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె కొంత కాలం క్రితం తల్లి ఇంటికి వెళ్లింది. కట్టుకున్న వాడు పెడుతున్న బాధల గురించి కన్న వాళ్లకు చెప్పి కన్నీటి పర్యంతమైంది. కుటుంబ సభ్యులు సర్దిచెప్పడంతో సంక్రాంతి పండగ తర్వాత ఈ నెల 17న పిల్లలను తీసుకొని హైదరాబాద్‌ తిరిగి వచ్చింది. అప్పటికే భార్యపై కోపంతో రగిలిపోతున్న ఆంజనేయులు.. ఆమెను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. సోమవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో సరస్వతి పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. ఇదే అదనుగా భావించిన ఆంజనేయులు ఇంట్లో ఉన్న రోకలి బండతో మోది భార్యను దారుణంగా హత్య చేశాడు.

వీడియోకాల్‌ చేసిన పిల్లలు..

ఉదయాన్నే నిద్రలేచిన పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే మేనమామ ప్రశాంత్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. అయితే, అతడు మొదట నమ్మలేదు. దీంతో వీడియో కాల్‌ చేసి చూపించారు. ప్రశాంత్‌ వెంటనే 100కు ఫోన్‌ చేశాడు. బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సరస్వతి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

బావమరిదిపై గతంలో కత్తితో దాడి..

ఆంజనేయులు పలుమార్లు సరస్వతిని కొడుతుండటంతో ఆమె తమ్ముడు ప్రశాంత్‌ బావను నిలదీసి గొడవకు దిగేవాడు. దీంతో ప్రశాంత్‌పై పగపెంచుకున్న ఆంజనేయులు 2022లో అతడిపై కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది.

Updated Date - Jan 21 , 2026 | 04:54 AM