విధుల్లో ఉన్న హోంగార్డు ఆత్మహత్య
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:39 AM
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు ఎస్సై తనను కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ హోంగార్డు చెంచు బయన్న(45) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కోడేరు ఎస్సై కులం పేరుతో దూషించాడని ఆరోపణ
కొల్లాపూర్/అచ్చంపేట టౌన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు ఎస్సై తనను కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ హోంగార్డు చెంచు బయన్న(45) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అచ్చంపేట పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. సలేశ్వరం జాతరకు వెళ్తున్న క్రమంలోనే ఆయన పురుగుల మందు తాగి ప్రాణాలు వదలడం కలకలం రేపింది. కొల్లాపూర్ పరిధిలోని కోడేరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న బయన్న.. మంగళవారం సలేశ్వరం జాతర డ్యూటీకి హాజరుకాకపోవడంతో ఉన్నతాధికారులు గైర్హాజరు వేశారు. దీనిపై మనస్తాపానికి గురైన ఆయన బుధవారం తన డ్యూటీ ఆర్డర్ కాపీని తెలంగాణ ఆదివాసీ చెంచు రాష్ట్ర కమిటీ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. ఓ తెల్లకాగితంపై కోడేరు ఎస్సై వేణుగోపాల్ ఫోన్ నంబరు రాసి, తాను సలేశ్వరం జాతర డ్యూటీలో ఉన్నట్లు ఫొటో దిగి అదే గ్రూపులో పెట్టారు. అనంతరం తన బంధుమిత్రుడైన కొల్లాపూర్ వాసికి ఫోన్ చేసి ఎస్సై తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయాలని కోరారు. తాను మందు తాగానని, ఆయాసంగా ఉందని చెప్పారు. అచ్చంపేటలోని చెక్‌పోస్ట్ వద్ద బయన్న స్పృహతప్పి ఉండటాన్ని చూసిన పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. ఘటనపై కోడేరు ఎస్సైని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.