ల్యాప్‌టాప్ చోరీ నింద పడిందని..
ABN , Publish Date - May 20 , 2026 | 03:08 AM
ల్యాప్‌టాప్ చోరీకి సంబంధించి తనపై ఆరోపణలు రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆవేదనతో హెచ్‌సీయూలో విద్యార్థి ఆత్మహత్య
డ్రగ్స్‌కు డబ్బుల కోసం గతంలో చోరీ చేసిన మాట నిజమే
ఈసారి నేను చేయలేదు.. డ్రగ్స్‌కు డబ్బులు అడగాలని లేదు
తల్లిదండ్రులను ఉద్దేశించి సూసైడ్ నోట్.. మృతుడు బెంగాల్ వాసి
రాయదుర్గం, మే19 (ఆంధ్రజ్యోతి): ల్యాప్‌టాప్ చోరీకి సంబంధించి తనపై ఆరోపణలు రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఈ ఘటన జరిగింది. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మయాంక్ కుందు (23). సీఐ బాలరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. మయాంక్ హెచ్‌సీయూలో ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నాళ్లుగా మయాంక్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఇంటి నుంచి తల్లిదండ్రులు పంపే డబ్బులు సరిపోకపోవడంతో గతంలో హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌లను మయాంక్ చోరీ చేసి విక్రయించాడనే ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి అతడిపై కేసు నమోదైంది. తాజాగా మరో ల్యాప్‌టాప్ చోరీకి గురవ్వడంతో మయాంకే దొంగిలించాడంటూ ఆరోపణలొచ్చాయి. దీనిపై విద్యార్థులు, ప్రొఫెసర్లు అతడిని ప్రశ్నించారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన మయాంక్, తనను క్షమించాలంటూ తల్లిదండ్రులను ఉద్దేశించి సూసైడ్ నోట్ రాశాడు. తాను డ్రగ్స్‌కు అలవాటుపడి గతంలో ల్యాప్‌టాప్‌లు చోరీచేసిన మాట వాస్తవమేనని, అయితే ఈసారి తాను చోరీ చేయకున్నా నింద మోపారని, తాను దొంగతనం చేయలేదని లేఖలో రాశాడు. డ్రగ్స్ కోసం తల్లిదండ్రులను డబ్బులు అడగడం తనకు ఇష్టం లేదని, తాను క్యాంపస్ ఆవరణలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ రాసి ఆ లేఖను హాస్టల్ గదిలో పెట్టాడు. సోమవారం ఉదయం 8గంటల నుంచి మయాంక్ ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటం, అతడు కనిపించకపోవడంతో తోటి విద్యార్థులు అధికారులకు సమాచారమిచ్చారు. వర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు సెక్యూరిటీ సిబ్బంది మయాంక్ హాస్టల్ గదిని తనిఖీ చేశారు. ఆ గదిలో మయాంక్ సూసైడ్ నోట్ లభించింది. అందులో రాసిన విధంగా చెరువులో వెతగ్గా మయాంక్ మృతదేహం లభించింది. పోలీసులొచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.