నీటి గుంతలో పడి గురుకుల టెన్త్ విద్యార్థి మృతి
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:08 AM
స్నానానికని వెళ్లి నీటి గుంతలో పడి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివే ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం శివారులోని పగిడిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
న్యాయం చేయాలంటూ బంధువుల రాస్తారోకో..
యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లిలో ఘటన
భువనగిరి రూరల్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): స్నానానికని వెళ్లి నీటి గుంతలో పడి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివే ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం శివారులోని పగిడిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన బంధనాదం ఆంతోని రాజు కుమారుడు బాలఆకాశ్ (16) పగిడిపల్లిలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. ఆదివారం బాలఆకాశ్, తోటి విద్యార్థి రెహమత్‌ఖాన్‌తో కలిసి పాఠశాల సమీపంలోనే ఉన్న నీటి గుంత వద్దకు స్నానానికి వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే బాలఆకాశ్ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగాడు. ఈత రాకపోవడంతో కేకలు వేయగా గమనించిన రెహమత్‌ఖాన్ గుంతలోకి దూకి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రెహమత్‌ఖాన్ పాఠశాలకు చేరుకుని, విషయాన్ని టీచర్లకు చెప్పి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది నీటి గుంతలో వెతికి బాలఆకాశ్‌ను బయటకు తీసుకువచ్చి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. అస్వస్థతకు గురైన రెహమత్‌ఖాన్‌ను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా అతడు క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని, బాధ్యులపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాలఆకాశ్ తల్లిదండ్రులు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు. తమ కుమారుడి మృతిపై అనుమానాలున్నాయంటూ జిల్లా కేంద్ర ఆస్పత్రి ముందున్న ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న భువనగిరి తహసీల్దార్ ఎన్.అంజిరెడ్డి, భువనగిరి రూరల్ ఎస్‌హెచ్‌వో ఎం.అనిల్‌కుమార్, పోలీస్ సిబ్బంది చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల అసిస్టెంట్ సెక్రటరీ ఖయ్యూం, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్ బాధిత కుటుంబానికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీనివ్వడంతో రాస్తారోకో విరమించారు.