పుట్టిన తేదీ మార్చేసి టోకరా
ABN , Publish Date - May 06 , 2026 | 05:00 AM
పదవీ విరమణ కాకుండా ఓ ఉద్యోగి పుట్టిన తేదీనే మార్చేసిన ఘటన సాంఘిక సంక్షేమ శాఖలో బయటపడింది. గుంటూరు జిల్లాలో ఆ శాఖ కార్యాలయంలో...
ఐదేళ్లుగా సర్వీ్స్‌లోనేనే కొనసాగుతున్న ఓ ఉద్యోగి
గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖలో మోసం.. అంతర్గత విచారణ
గుంటూరు. మే 5(ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ కాకుండా ఓ ఉద్యోగి పుట్టిన తేదీనే మార్చేసిన ఘటన సాంఘిక సంక్షేమ శాఖలో బయటపడింది. గుంటూరు జిల్లాలో ఆ శాఖ కార్యాలయంలో 2000 జూలై 1న 4వ తరగతి ఉద్యోగిగా ఓ మహిళ చేరారు. అప్పట్లో ఆమె ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో 1961 జూలై 1న జన్మించినట్లు ఉంది. ఆమె ఎస్సార్(సర్వీస్ రిజిస్టర్)లో కూడా అదే తేదీ నమోదైంది. 2021 జూలైకి 60 ఏళ్లు పూర్తి అయినందున నిబంధనల ప్రకారం ఆమె పదవీ విరమణ చేయాలి. అయితే ఇద్దరు ఉద్యోగుల సహకారంతో సర్వీస్ రిజస్టర్‌లో ఆమె పుట్టిన సంవత్సరాన్ని 1969గా మార్చారు. 2021లో రిటైర్ కాకుండా ఇప్పటికీ కొనసాగుతున్నారు. నెలకు రూ. 84 వేలు జీతం తీసుకుంటున్నారు. మధ్యలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా పొందారు. ప్రస్తుతం నరసరావుపేటలో అటెండర్ పోస్టులో ఉన్న ఆమెకు.. ఇటీవల ఇంక్రిమెంట్ ఇచ్చారు. తాజాగా అంతర్గత ఆడిటింగ్‌లో పుట్టిన తేదీ మార్చిన విషయం బయటపడింది. అధికారులు లోతుగా విచారణ చేయడంతో సంక్షేమ శాఖలో గతంలో పనిచేసిన తృతీయ శ్రేణి ఉద్యోగి సహకారంతో పరిపాలన విభాగంలో పనిచేసే మరో ముఖ్య ఉద్యోగి చేసిన నిర్వాకమని తేలింది. ఈ మోసంపై లోతుగా విచారణ చేసి బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చెన్నయ్య ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఉద్యోగి 5 ఏళ్లుగా తీసుకున్న జీతభత్యాల రికవరీకి అధికారులు ప్రయత్నించగా, ఆమె ససేమిరా అన్నట్లు సమాచారం. జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి సాంఘిక సంక్షేమ శాఖకు పుష్కరకాలం క్రితం డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ ఉద్యోగిదే ట్యాంపరింగ్‌లో ప్రధాన పాత్ర అని సమాచారం.