ఉద్యోగంలో చేరిన పది రోజులకే విగతజీవిగా
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:35 AM
పది రోజుల క్రితం హరియాణలోని పంచకుల వేది టెక్నాలజీస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరిన కృష్ణా జిల్లా గుడివాడ యువకుడు బండ్ల రుషికేశ్ ...
హరియాణలో గుడివాడ టెకీ దారుణ హత్య
గుడివాడ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): పది రోజుల క్రితం హరియాణలోని పంచకుల వేది టెక్నాలజీస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరిన కృష్ణా జిల్లా గుడివాడ యువకుడు బండ్ల రుషికేశ్ (27) దారుణ హత్యకు గురయ్యారు. గుడివాడలోని బేతవోలుకు చెందిన బండ్ల మోహనరావు కుమారుడు రుషికేష్ హరియాణాలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. ఇటీవలే ఆయనకు హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే హరియాణలో మరో ఇంటర్వ్యూ ఉందని చెప్పిన రుషికేశ్.. 15 రోజుల క్రితం అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి పంచకుల వేది టెక్నాలజీ్‌సలో ఉద్యోగం వచ్చిందని పది రోజుల క్రితం విధుల్లో కూడా చేరాడని సమాచారం. అయితే.. శుక్రవారం కంపెనీ రూమ్‌లో రుషికేశ్ రక్తపు మడుగులో పడి మృతిచెందిన విషయం హరియాణ నుంచి గుడివాడ వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు రుషికేశ్ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేశారు. కుటుంబసభ్యులు హుటాహుటిన హరియాణకు బయల్దేరి వెళ్లారు. అయితే.. రుషికేశ్‌ను ఎవరు, ఎందుకు హత్య చేశారు..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.