మత్తుమందు ఇచ్చి గొంతు నులిమేసి..అమ్మమ్మను చంపేసిన మనవడు
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:26 AM
జల్సాలకు అలవాటు పడిన ఓ మనవడు.. తనని ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మమ్మను డబ్బు, నగలకోసం హత్య చేశాడు. వృద్ధురాలిది సహజ మరణమని భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేయగా...
డబ్బు, నగల కోసం స్నేహితుడితో కలిసి ఘాతుకం
మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన
నిందితుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
రామాయంపేట, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటు పడిన ఓ మనవడు.. తనని ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మమ్మను డబ్బు, నగలకోసం హత్య చేశాడు. వృద్ధురాలిది సహజ మరణమని భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేయగా... పోలీసు విచారణతో హత్యోదంతం వెలుగు చూసింది. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన ఈ ఘటనలో దోమకొండ సాయమ్మ(65)హత్యకు గురైంది. రామాయంపేటకు చెందిన సాయ మ్మ కుమారుడి కుటుంబం పక్కనే మరో ఇంట్లో నివాసముంటోంది. అయితే, ఆమె చిన్న కుమార్తె కుమారుడు విశాల్ అంటే సాయమ్మకు ఎంతో ప్రేమ. హైదరాబాద్‌లో ఉంటున్న విశాల్ తరచూ అమ్మమ్మ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకునేవాడు. జల్సాలకు అలవాటుపడిన విశాల్.. అమ్మమ్మ వద్ద ఉన్న బంగారు నగలు, నగదును కాజేయాలని అనుకున్నాడు. ప్రశాంత్ అనే స్నేహితుడితో కలిసి ఈ నెల 18న సాయమ్మతో మత్తు మందు కలిపిన మద్యాన్ని తాగించి స్పృహతప్పేలా చేశారు. ఆపై, గొంతునులిమి హతమార్చి.. ఆమె మెడలోని 4తులాల బంగారు కమ్మలు, ఉంగరం, రూ.10,000 లు దోచుకుని పరారయ్యారు. మరుసటి రోజు గమనించిన కుటుంబసభ్యు లు.. వయసురీత్యా గుండెపోటుతోనే చనిపోయి ఉంటుందని భావించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ,సాయమ్మ మరణంపై అనుమానం ఉందంటూ ఆమె కుమారుడు శ్యామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. విశాల్, ప్రశాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.