Share News

స్నేహితుడిని చంపేసి.. పాతిపెట్టి..

ABN , Publish Date - Apr 25 , 2026 | 07:37 AM

మద్యం మత్తులో ముగ్గురు స్నేహితుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో వారిలో ఇద్దరు కలిసి ఒకరిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. ఆపై నేరం బయటపడకుండా ఉండేందుకు చెరువు సమీపంలో ఏపుగా పెరిగిన తుంగలో మృతదేహాన్ని పాతిపెట్టారు.

స్నేహితుడిని చంపేసి.. పాతిపెట్టి..

  • మద్యం మత్తులో ఇద్దరు యువకుల దారుణం

  • ఘటనను ఓ నిందితుడు తల్లితో చెప్పుకోవడంతోవెలుగులోకి

  • భువనగిరి జిల్లాలో ఘటన.. ఒకరి అరెస్టు, మరొకరు పరారీలో

బొమ్మలరామారం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ముగ్గురు స్నేహితుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో వారిలో ఇద్దరు కలిసి ఒకరిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. ఆపై నేరం బయటపడకుండా ఉండేందుకు చెరువు సమీపంలో ఏపుగా పెరిగిన తుంగలో మృతదేహాన్ని పాతిపెట్టారు. నిందితుల్లో ఒకరు ఈ విషయాన్ని ఇంటికొచ్చి కన్నతల్లితో చెప్పుకోవడంతో విషయం బయటపడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారణం వెలుగుచూసింది. భువనగిరి రూరల్‌ సీఐ చంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన రాగీరు మధు (25), గాంధారి చరణ్‌, ఊట్ల నవీన్‌ స్నేహితులు. ముగ్గురూ మద్యానికి బానిసయ్యారు. ఎక్కువగా మద్యం మత్తులోనే ఉండే మధు రెండ్రోజులకోసారి ఇంటికి వెళ్లేవాడు. చరణ్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, నవీన్‌ ఆటో తోలుకుంటున్నాడు. ఈ ముగ్గురు యువకుల తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం మద్యం మత్తులో ఇంటికొచ్చిన చరణ్‌ తాను మధును హత్యచేసి మృతదేహాన్ని ఇసుక దిబ్బలో పెరిగిన తుంగలో పాతిపెట్టినట్లు తల్లి వరలక్ష్మికి చెప్పాడు. ఆమే తన కుమారుడు చరణ్‌ను పోలీసులకు అప్పగించింది. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈనెల 21న అర్ధరాత్రి దాటాక హత్య ఘటన జరిగినట్లు విచారణలో చరణ్‌ వెల్లడించాడు. విచారణలో చరణ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ రోజు సాయంత్రం మేడిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో ఉన్న హరితవనం వెంచర్‌లో చరణ్, నవీన్‌లతో కలిసి మధు మద్యం తాగాడు. ఆ క్రమంలో ముగ్గురి మధ్య వాగ్వాదం నెలకొంది.


చరణ్‌, నవీన్‌ కలిసి మధు తలపై రాడ్డుతో కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. తెల్లవారుజామున 4 గంటలకు మృతదేహాన్ని గ్రామానికి దగ్గర్లోని షామీర్‌పేట వాగు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఇసుక దిబ్బలో పెరిగిన తుంగలో మధు మృతదేహాన్ని చరణ్‌, నవీన్‌ పాతిపెట్టారు. మృతదేహం బయటపడినా ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు దుస్తులు తొలగించారు. మధుకు రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండే అలావాటు ఉండటంతో అతడు మూడు రోజులు ఇంటికి రాకపోయినా తల్లిదండ్రులు అనుమానించలేదు. కుమారుడు హత్యకు గురయ్యాడని తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు. చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు నవీన్‌ పరారీలో ఉన్నాడు. మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Apr 25 , 2026 | 08:39 AM