Share News

బిల్లులు రాక మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:29 AM

గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం, చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ మాజీ సర్పంచ్‌ దిక్కుతోచని....

బిల్లులు రాక మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య

  • అప్పులు చేసి రూ.30 లక్షలతో గ్రామంలో అభివృద్ధి పనులు

  • ఏళ్లుగా రాని బిల్లులు.. అప్పులిచ్చినవారి నుంచి వేధింపులు

  • దిక్కుతోచని స్థితిలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణం

  • సిద్దిపేట జిల్లా మహ్మదాపూర్‌లో ఘటన.. మాజీ సర్పంచ్‌ల నిరసన

  • కరీంనగర్‌ రోడ్డుపై రాస్తారోకో

హుస్నాబాద్‌ రూరల్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం, చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ మాజీ సర్పంచ్‌ దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ మాజీ సర్పంచ్‌ పిట్టల సంపత్‌ (48). సంపత్‌ వరుసగా రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. అప్పులు తెచ్చి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేశారు. దాదాపు రూ.30లక్షల వరకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉంది. అప్పులిచ్చిన వారి నుంచి ఆయనకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల గత పనులకు సంబంధించిన రూ. 12 లక్షల వరకు బిల్లులు గ్రామ పంచాయతీ అకౌంట్‌లో జమయ్యాయి. అయితే ఈ డబ్బు ఇవ్వకుండా ప్రస్తుత సర్పంచ్‌, గ్రామ కార్యదర్శి జాప్యం చేయడం, రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో సంపత్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య స్వప్న, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా సంపత్‌ ఆత్మహత్య ఘటనకు నిరసనగా మాజీ సర్పంచ్‌లు కరీంనగర్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది మూమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, సంపత్‌ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సంపత్‌ది ఆత్మహత్య కాదని ఇది ప్రభుత్వ హత్యేనని సర్పంచ్‌ల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య ప్రకటన విడుదల చేశారు. సంపత్‌ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 24 , 2026 | 04:29 AM