Share News

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..తండ్రిని చంపిన కొడుకులు

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:25 AM

వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడనే కోపంతో ఇద్దరు కొడుకులు తమ తండ్రిని హత్య చేశారు. భూపాలపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో జిల్లాలోని....

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..తండ్రిని చంపిన కొడుకులు

  • మహిళ ఇంట్లోనే దాడి చేసిన కుమారులు

  • భూపాలపల్లి జిల్లాలో ఘటన

రేగొండ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడనే కోపంతో ఇద్దరు కొడుకులు తమ తండ్రిని హత్య చేశారు. భూపాలపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో జిల్లాలోని రేపాకకు చెందిన కుర్రే చేరాలు(55).. కుమారుల చేతిలో హతమయ్యాడు. రేపాకకు చెందిన కుర్రే చేరాలు (55) కు భార్య సులోచన, కుమారులు రామ్‌, లక్ష్మణ్‌ (కవలలు), కూతుళ్లు సరిత, సౌజన్య ఉన్నారు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే చేరాలు 25 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. అయినా చేరాలు ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతని కుటుంబసభ్యులు పదేళ్ల క్రితం చేరాలుతో కలిసి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అయితే, హమాలీగా పని చేస్తున్న చేరాలు హఠాత్తుగా చేపల పెంపకాన్ని చేపట్టాడు. ఇందులో భాగంగా రేపాకలోని ఎర్రకుంట చెరువును మరో ఇద్దరితో కలిసి గతేడాది దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పి పది రోజుల క్రితం రేపాక వచ్చాడు. ఈ క్రమంలో గతంలో తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను కలిసిన చేరాలు.. ఆమె ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టాడు. అయితే, చేరాలు మూడు రోజులుగా ఫోన్లకు స్పందిచకపోవడంతో కుమారులిద్దరూ శనివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి రేపాక వచ్చారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంట్లో తండ్రి ఉండటాన్ని చూసి కోపాన్ని ఆపుకోలేకపోయారు. తండ్రిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ గాయాలతో ఆస్పత్రిపాలైన చేరాలు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. రామ్‌, లక్ష్మణ్‌ శనివారం అర్ధరాత్రి చేరాలుపై గొడ్డలితో దాడి చేశారని, తీవ్రంగా గాయపడిన చేరాలు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అడ్డొచ్చిన ఆ మహిళపై కూడా దాడి చేసిన వారు ఆమె మెడలో ఉన్న బంగారు తాడును లాక్కొని పరారయ్యారని అంటున్నారు. అయితే, కొడుకులిద్దరూ కోపంతో తండ్రిపై దాడి చేశారని, తలపై కొట్టడం, కడుపులో పిడిగుద్దులు గుద్దడం వల్ల చేరాలు తీవ్రంగా గాయపడ్డాడని గ్రామ ప్రజలు అంటున్నారు. తీవ్రంగా గాయపడిన తండ్రిని కొడుకులే ఆస్పత్రికి తరలించారని చెబుతున్నారు. కాగా, చేరాలు అన్న కుర్రే కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 06 , 2026 | 04:25 AM