Share News

చక్కని భోజనం పెట్టించి.. నీళ్లలోకి తోసేసి

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:31 AM

భార్యతో గొడవపడి బంగారం లాంటి ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి! విహారయాత్ర పేరుతో పిల్లలను బయటకు తీసుకెళ్లి..

చక్కని భోజనం పెట్టించి.. నీళ్లలోకి తోసేసి

  • ఇద్దరు బిడ్డల ప్రాణం తీసి తానూ దూకి తండ్రి ఆత్మహత్య

  • సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఘటన

నిజాంపేట(ఎన్‌), నిజాంసాగర్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): భార్యతో గొడవపడి బంగారం లాంటి ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి! విహారయాత్ర పేరుతో పిల్లలను బయటకు తీసుకెళ్లి.. వారికి చక్కని భోజనం పెట్టించి, బోటుపై ప్రాజెక్టులో విహరింపజేసి.. ఫొటోలు, వీడియోలు తీసి బంధువులకు వాట్సాప్ లో పంపాడు. ఆ తర్వాత ‘ఇక సెలవు’ అని మెసేజ్‌ పెట్టి.. పిల్లలను నీళ్లలో తోసేసి, తానూ దూకాడు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులు సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన గూల కృష్ణ (34), అతడి పిల్లలు రక్షిత్‌ (9), అనన్య (5). కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణం అని తెలుస్తోంది. పదేళ్ల క్రితం కృష్ణకు పెళ్లయింది. భార్య సవిత, పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం పటాన్‌చెరు వెళ్లాడు. అక్కడ అతడు పెయింటర్‌గా పనిచేసేవాడు. సవిత టిఫిన్‌ సెంటర్‌లో పనిచేసేది. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కృష్ణ గురువారం ఉదయం రక్షిత్‌, అనన్యలను తీసుకొని నిజాంపేటకు వచ్చాడు. ఇంటికొచ్చిన కొద్దిసేపటికే పిల్లలను బైక్‌పై కూర్చోబెట్టుకొని నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. అక్కడ పిల్లలను నీళ్లలోకి తోసేసి తాను దూకాడు. బంధువులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి ముగ్గురి మృతదేహాలను బయటకు తీయించారు.

Updated Date - Jun 13 , 2026 | 06:32 AM