Family Tragedy: బిడ్డా నిన్ను సాకలేను.. నేను బతకలేను
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:16 AM
వికలాంగుడైన కొడుకును సాకలేక ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కొడుకుకు సేవలు చేస్తూ పనులు చేసుకోలేకపోవడంతో అంతంతమాత్రం సంపాదనతో అప్పులపాలయ్యాడు.
దివ్యాంగుడైన కొడుకును చంపి.. తండ్రి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా రాంపుర్‌లో విషాద ఘటన
జన్నారం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): వికలాంగుడైన కొడుకును సాకలేక ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కొడుకుకు సేవలు చేస్తూ పనులు చేసుకోలేకపోవడంతో అంతంతమాత్రం సంపాదనతో అప్పులపాలయ్యాడు. దీంతో కొడుకు గొంతు కోసి చంపాడు. ఆపై తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. జన్నారం మండలంలోని రాంపుర్ గ్రామానికి చెందిన పాలగాని భూమయ్య (40)స్వరూప దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు కార్తీక్ (9) పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే భూమయ్య కొద్ది నెలలుగా కాలేయ వ్యాధితో బాధపడుతూ పనికి వెళ్లలేక ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. భార్య స్వరూప కూలి పనికి వెళ్లగా వచ్చే డబ్బులతోనే ఇల్లు గడుస్తోంది. దీంతొ తానూ, కుమారుడు ఇంటికి భారమయ్యామని భూమయ్య బాధపడుతుండేవాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో కార్తిక్ గొంతు కోసి హత్య చేశాడు. ఆపై తాను కూడా గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.