కనురెప్పే కాటేసింది!
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:30 AM
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ఓగ్రామంలోని దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.
కుమార్తెపై తండ్రి అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు
తాళ్లూరు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ఓగ్రామంలోని దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. మైనర్లయిన వీరిద్దరూ గ్రామంలోనే చదువుకుంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన తండ్రి... పెద్ద కుమార్తె (13)ను భయపెట్టి రెండునెలలుగా రెండు మూడు పర్యాయాలు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక వారం రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండటంతో రెండు రోజుల క్రితం తల్లి ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారించారు. బాలికను తల్లి ప్రశ్నించగా తండ్రే అఘాయిత్యానికి పాల్పడినట్టు చెప్పింది. దీంతో ఆమె ఒంగోలు రిమ్స్‌లోని ఔట్ పోస్టు పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. వారు పూర్తి వివరాలు రికార్డు చేసి తాళ్లూరు పోలీసులకు పంపగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు ఏడేళ్ల క్రితం తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు కేసు నమోదైంది. సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును కోర్టు కొట్టివేసింది.
నాన్న అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు
సింగరాయకొండ, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఈనెల 2న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె తండ్రి అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం బయటకు చెప్తే అంతుచూస్తానని బెదిరించాడు. బాలిక ఆదివారం మేనమామల దృష్టికి విషయం తీసుకెళ్లింది. వారి సహకారంతో తల్లితోపాటు బాలిక సింగరాయకొండ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు.