ఒకే ఇంట్లో నలుగురి మృతి
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:31 AM
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక ఇంట్లో నలుగురు అనుమానాస్పదరీతిలో మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. పట్టణ శివారు ప్రాంతమైన సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలోని....
కుళ్లిన స్థితిలో మృతదేహాలు.. వీరిది హత్యా? ఆత్మహత్యా?
మృతుల్లో ఇంటి యజమాని, ఆయన భార్య, కుమార్తె
4వ మృతదేహం కొడుకు ముజామిల్‌ది అని అనుమానం
నల్లగొండలోని తెలంగాణ కాలనీలో ఘటన
నల్లగొండ క్రైం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక ఇంట్లో నలుగురు అనుమానాస్పదరీతిలో మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. పట్టణ శివారు ప్రాంతమైన సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలోని ఓ ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు సోమవారం రాత్రి పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి ఇంటి గేటు తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా నాలుగు మృతదేహాలు ఉబ్బి, పూర్తిగా కుళ్లిపోయి, పురుగులు పట్టిన స్థితిలో కనిపించాయి. అన్ని మృతదేహాలపై లోతైన గాయాలు, రక్తపు మరకలు ఉన్నాయి. వీరిని ఎవరైనా హత్య చేశారా? లేదంటే ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తేలాల్సి ఉంది. మృతులను ఇంటి యజమాని మహమ్మద్ సుల్తాన్ (45), అతడి భార్య హసీనా (40), కుమార్తె అఫ్సార (13)గా గుర్తించారు. నాలుగో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. అయితే అది సుల్తాన్ కుమారుడైన ముజామిల్ (20) మృతదేహం అని అతడి అమ్మమ్మ గుర్తించినట్లు చెబుతున్నా, పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. ఇంటి వరండాలో సుల్తాన్, హసీనా పక్కపక్కనే పడి ఉంగా.. కాస్త దూరంలో మరుగుదొడ్డికి దగ్గరగా ముజామిల్ మృతదేహం పడి ఉంది. పడకగదిలో మంచం కింద తీవ్రగాయాల మధ్య, రక్తస్రావం జరిగిన స్థితిలో అఫ్సార మృతదేహం పడి ఉంది. వీరంతా నాలుగైదు రోజుల క్రితం చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. సుల్తాన్, హసీనా మృతదేహాలపై తీవ్రగాయాలున్నాయి. ముజామిల్‌దిగా భావిస్తున్న మృతదేహానికి ప్యాంటు తొడల వరకు విప్పి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
కత్తితో ఎందుకు తిరుగుతున్నావు? అని అడిగితే..
సుల్తాన్ సీట్ల కవర్లు కుట్టే షాపులో పనిచే స్తుండగా, హసీనా పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ముజామిల్ ప్రకాశం బజార్‌లోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. హసీనా పనిచేసే స్కూల్‌లోనే అఫ్సార ఎనిమిదో తరగతి చదువుతోంది కాగా ముజామిల్ ఇటీవల తరచూ కత్తిని చేతపట్టుకొని తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. కత్తితో ఎందుకు తిరుగుతున్నావు? అని అతడిని స్థానికులు, పనిచేసే చోట తోటి వర్కర్లు అడిగితే చేపల వేటకు వెళ్లేందుకు అవసరమైన ఎర్రలను కోసేందుకు కత్తిని వెంటతీసుకెళుతున్నానని చెప్పేవాడని వారు చెబుతున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేయాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలిని పోలీసులు సందర్శించి ఆధారాలు సేకరించారు. మరణాల వెనక మిస్టరీని ఛేదిస్తామని వెల్లడించారు.
ఇద్దరికీ రెండోపెళ్లి
మహమ్మద్ సుల్తాన్‌కు హసీనా రెండో భార్య కాగా, హసీనాకు కూడా సుల్తాన్ రెండో భర్త అని స్థానికులు, బంధువులు పోలీసుల విచారణలో తెలిపారు. సుల్తాన్ మొదటి భార్య చనిపోగా, హసీనాను వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. ముజామిల్, అఫ్సార ఇద్దరూ సుల్తాన్ మొదటి భార్య పిల్లలేనని గుర్తించారు. హసీనాకు కూడా మొదటి వివాహ సమయంలో ఒక కూతురు ఉండగా, ఆమెకు వివాహం జరిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అఫ్సారను హసీనా ప్రతిరోజూ తన స్కూటీపైనే స్కూల్‌కి తీసుకెళ్లేదని చెబుతున్నారు.