Share News

నా భార్యాబిడ్డల ఆత్మహత్యకు..అత్త, బావమరిదే కారణం

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:57 AM

చర్లపలి రైల్వే స్టేషన్‌ సమీపంలో గత జనవరి 30న అర్థరాత్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విజయశాంతి రెడ్డి కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

నా భార్యాబిడ్డల ఆత్మహత్యకు..అత్త, బావమరిదే కారణం

  • పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయారెడ్డి కేసులో సంచలన పరిణామం

  • అత్త, బావమరిదిపై పోలీసులకు ఆమె భర్త సురేందర్‌రెడ్డి ఫిర్యాదు

  • తన ఇంట్లో ఉన్న రూ.1.4 కోట్ల నగదు, కిలోన్నర బంగారం తీసుకెళ్లారని ఆరోపణ

  • సురేందర్‌ రెడ్డి ఆరోపణలు అవాస్తవమన్న ఆయన బావమరిది చిరంజీవి

హైదరాబాద్‌ సిటీ/పీర్జాదిగూడ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): చర్లపలి రైల్వే స్టేషన్‌ సమీపంలో గత జనవరి 30న అర్థరాత్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విజయశాంతి రెడ్డి కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తన భార్యాబిడ్డలు ఆత్మహత్య చేసుకోవటానికి విజయశాంతిరెడ్డి తల్లి పుష్పవతి, బావమరిది చిరంజీవి, అతడి భార్య లక్ష్మి కారణమని విజయశాంతిరెడ్డి భర్త సురేందర్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి వారికి తగిన శిక్ష పడేలా చూడాలని మేడిపల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన భార్యాబిడ్డలు మృతిచెందిన 25వ రోజు నుంచి అత్త, బావమరిది తనను ఆస్తికోసం వేధిస్తున్నారని తెలిపారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. ‘నేను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాను. ఆరు నెలలకు ఒకసారి వచ్చిపోతూ ఉండేవాడిని. నా భార్య సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఇక్కడే మా పిల్లలను చదివిస్తూ ఉండేది. విజయశాంతిరెడ్డి చనిపోయినప్పుడు ఇంట్లో రూ.1.4 కోట్ల నగదు. కిలోన్నర బంగారం ఉన్నాయి. ఆమె చనిపోయిన వెంటనే వాటితోపాటు ఆస్తి పత్రాలను చిరంజీవి, పుష్పవతి తీసుకెళ్లారు. నా భార్య డబ్బుతోనే ఆమె తమ్ముడు చిరంజీవి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. అతనితో ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చిన మనస్పర్థల కారణంగానే ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురి మరణానికి కారణమవటమే కాకుండా ఇప్పుడు నా ఆస్తిని కూడా చేజిక్కించుకోవడానికి చిరంజీవి అతని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.’ అని ఆరోపించారు. తన బావ సురేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని విజయశాంతిరెడ్డి సోదరుడు చిరంజీవి తెలిపారు. తన సోదరి వివాహం జరిగినప్పటి నుంచే వివాదాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. పెళ్లి సమయంలో సురేందర్‌రెడ్డి వయసు విషయంలో తప్పుదారి పట్టించడంతో పాటు, ఆస్తుల గురించి కూడా అబద్ధాలు చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. సురేందర్‌రెడ్డిని తాను ఎప్పుడూ బెదిరించలేదని స్పష్టంచేశారు. సురేందర్‌రెడ్డి ఫోన్‌కాల్‌ డేటాను బయటకు తీస్తే తన సోదరి, ఆమె పిల్లల ఆత్మహత్యకు గల అసలు కారణం తెలుస్తుందని అన్నారు. విజయశాంతిరెడ్డి తన కుమారుడు విశాల్‌రెడ్డి, కూతురు చైతన్య రెడ్డితో కలిసి జనవరి 30న అర్థరాత్రి గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహించినా వారి ఆత్మహత్యకు గల కారణాన్ని తెలుసుకోలేకపోయారు. పని ఒత్తిడి, ఒంటరితనం కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేల్చి దర్యాప్తును ముగించారు. ఘటన జరిగిన మూడు నెలల తర్వాత ఇప్పుడు ఆమె కుటుంబసభ్యులే పరస్పర ఆరోపణలు చేసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - Apr 14 , 2026 | 06:45 AM