ఇన్‌స్టాలో అడ్రస్ పట్టి.. 4 రోజుల రెక్కీ!
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:47 AM
మాజీ భార్య సునీత హత్య ఏదో ఆవేశంలో చేసింది కాదని.. ఆమెపై నిలువెల్లా పగతో రగిలిపోయిన మహేశ్, హత్య కోసం పకడ్బందీ పథకం వేశాడు.
మాజీ భార్య సునీత హత్యకు మహేశ్ పకడ్బందీ ప్రణాళిక
60 రోజులు ఓ హాస్టల్లో ఉండి ఆమె కదలికలపై దృష్టి
వాచ్‌మన్ లేని టైం చూసి మారణాయుధాలతో ఫ్లాట్‌లోకి
సునీత ముఖంపై పెప్పర్ స్ర్పే కొట్టి.. కత్తితో పొడిచి హత్య
గృహహింస కేసు పెట్టడం.. వేదనతో తల్లి చనిపోవడంతోనే చంపాలన్న కసి
హైదరాబాద్ సిటీ/వనస్థలిపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మాజీ భార్య సునీత హత్య ఏదో ఆవేశంలో చేసింది కాదని.. ఆమెపై నిలువెల్లా పగతో రగిలిపోయిన మహేశ్, హత్య కోసం పకడ్బందీ పథకం వేశాడు. ఇన్‌స్టా రీల్స్‌లో సునీత ఉంటున్న ఫ్లాట్, అపార్ట్‌మెంట్, పరిసరాలన్నీ ఉండటంతో లొకేషన్ పట్టుకున్నాడు. తుర్కయాంజిల్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో 60 రోజుల పాటు ఉండి మరీ సునీత కదలికలపై కన్నేశాడు. నాలుగు రోజులు రెక్కీ నిర్వహించి మరీ హత్యచేశాడు. ఈ మేరకు కేసు విచారణలో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. దేవరకొండ మహేశ్ (32)ది పెద్దపల్లి జిల్లా మంథని. బుద్దార్తి సునీతదేమో మహారాష్ట్ర చంద్రపురి జిల్లా బల్లాపూర్ మండలం తిలక్‌వార్డ్. సునీత వాళ్ల అమ్మ పుట్టిల్లు కూడా మంథని కావడంతో ఆమె తరచూ అమ్మమ్మగారింటికి వెళ్లేది. ఈ క్రమంలో పదేళ్ల క్రితం మహేశ్, సునీతకు పరిచయం ఏర్పడింది. బీటెక్ చదివిన మహేశ్ 2019లో ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ చేశాడు. ఆ తర్వాత కెనడాలో కొలువు సంపాదించాడు. 2022లో మహేశ్ పెద్దలను ఒప్పించి సునీతను పెళ్లి చేసుకున్నాడు. సునీతకు వీసా రాకపోవడంతో ఆమెను ఇంటివద్దే ఉంచి తానొక్కడే కెనడా వెళ్లాడు. కొన్నాళ్లకే సునీత మునుపటిలా తనతో మాట్లాడటం లేదని అతడికి అనిపించింది. సునీతకు వీసా మంజూరయ్యాక ఆమెను కెనడా తీసుకెళ్లాడు. కొద్దిరోజులకే అతడికి భార్య ప్రవర్తనపై అనుమానమొచ్చింది. తరచూ ఆమె ఫోన్లో అదేపనిగా ఇతరులతో మాట్లాడుతుండటంతో నిలదీశాడు. ఇది ఇద్దరిమధ్య గొడవలకు దారితీసింది. భర్త వేధిస్తున్నాడంటూ కెనడా పోలీసుల సాయంతో సునీత ఇండియాలోని తల్లిదండ్రుల వద్దకు తిరిగొచ్చేసింది. కెనడాలో ఉన్న భర్తపైన, మంథనిలో ఉంటున్న అత్తామామలపైన బల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో గృహహింస కేసు, విడాకుల కేసు పెట్టింది.
అయితే కోర్టు నుంచి విడాకులు మంజూరు కాకపోయినా మహేశ్, సునీత 2024లో పెద్దల సమక్షంలో విడిపోయారు. అప్పటికీ మహేశ్ కెనడాలోనే ఉన్నాడు. అయితే పెళ్లయ్యాక భర్త ఒక్కడే కెనడా వెళ్లడంతో ఇక్కడ ఒంటరిగా ఉన్న సునీత వనస్థలిపురానికి చెందిన ఉడ్కుల శ్రీనాథ్‌ను ప్రేమించింది. తర్వాత వీసా వచ్చి భర్త మహేశ్ తనను కెనడా తీసుకెళ్లినా శ్రీనాథ్‌ను మరిచిపోలేకపోయింది. భర్తతో విడిపోయాక.. 2025 ఏప్రిల్ 26న పెద్దల సమక్షంలో శ్రీనాథ్‌ను ఆమె పెళ్లి చేసుకుంది ఇటీవల తల్లి గుండెపోటుతో మృతిచెందడంతో మహేశ్ ఇండియాకొచ్చాడు. తర్వాత తిరిగి కెనడా వెళ్లిపోదామనుకున్నా సునీత పెట్టిన కేసుల కారణంగా సాధ్యపడలేదు. శ్రీనాథ్‌తో కలిసి సునీత వనస్థలిపురం కాప్రాయి చెరువు సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు ఆమె రీల్స్ ద్వారా తెలుసుకున్నాడు.
ఎలాగైనా చంపితీరాలి అని!
ఓ హాస్టల్లో ఉంటూ సునీత హత్యకు పథక రచన చేశాడు మహేశ్. తలుపులు బిగించుకుంటే కోసేందుకు గ్రైండర్ కట్టర్ మిషన్, చైనా కట్టర్ కొన్నాడు. ఆమె కంట్లో కొట్టేందుకు పెప్పర్ స్ర్పే, పొడిచేందుకు గార్డెనింగ్ నైఫ్, స్మాల్ నెఫ్ కొన్నాడు. ఆమెను హత్యచేశాక.. తాను ఆత్మహత్య చేసుకునేందుకు ఓ క్యాన్ నిండా పెట్రోలు నింపుకొన్నాడు. ఇవన్నీ తీసుకొని.. ఓ అద్దె కారులో సునీత ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ వాచ్‌మన్ లేని సమయం చూసి.. మెట్ల మీదుగా సునీత ఫ్లాట్‌కు చేరుకున్నాడు. లోపలికి ప్రవేశించి.. సునీత ముఖంపై పెప్పర్ స్ర్పే కొట్లాడు. ఆపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఆ తర్వాత ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పు పెట్టుకోవాలనుకున్నా అప్పటికే పోలీసులు రావడంతో అరెస్టయ్యాడు. తాను ఏ శిక్షకైనా సిద్ధమని.. చావడానికి కూడా వెనుకాడనని పోలీసుల విచారణలో మహేశ్ స్పష్టం చేసినట్లు తెలిసింది.