Share News

అడగ్గానే రూ.20 ఇవ్వలేదని నరికేశాడు

ABN , Publish Date - Jul 18 , 2026 | 06:24 AM

మద్యానికి బానిసై డబ్బు కోసం దారిన పోయే వాళ్లని వేధించే ఓ మందుబాబు కిరాతకానికి పాల్పడ్డాడు. తాను అడిగిన వెంటనే రూ.20లు ఇవ్వలేదనే కోపంతో ఓ వృద్ధుడిని పట్టపగలే నడిరోడ్డుపై చంపేశాడు.

అడగ్గానే రూ.20 ఇవ్వలేదని నరికేశాడు

  • ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టపగలే వృద్ధుడి దారుణ హత్య

  • మద్యానికి బానిసైన ఓ వ్యక్తి కిరాతకం

  • గొడ్డలితో దాడి.. అనంతరం కత్తితో తల, మొండెం వేరు చేసి పరారీ

రెబ్బెన, జూలై 17 (ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసై డబ్బు కోసం దారిన పోయే వాళ్లని వేధించే ఓ మందుబాబు కిరాతకానికి పాల్పడ్డాడు. తాను అడిగిన వెంటనే రూ.20లు ఇవ్వలేదనే కోపంతో ఓ వృద్ధుడిని పట్టపగలే నడిరోడ్డుపై చంపేశాడు. గొడ్డలితో దాడి చేసి, ఆపై వృద్ధుడి తల, మొండెంను వేరు చేసి కిరాతకానికి తెగబడ్డాడు. కుమరం భీం జిల్లా రెబ్బెనలో ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఆసిఫాబాద్‌ మండలం పర్సనంబాల గ్రామానికి చెందిన మసాడి సోమయ్య(65) దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. తన పెద్ద కూతురిని హైదరాబాద్‌కు పంపేందుకు మసాడి సోమయ్య తన భార్య తానుబాయి, చిన్నకూతురు లక్ష్మితో కలిసి శుక్రవారం ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. రైలు రాక ఆలస్యం కావడంతో సోమయ్య టీ తాగుదామని సమీపంలోని ఓ హోటల్‌కు వెళ్లారు. అయితే, రెబ్బెన మండలం తుంగెడ గ్రామానికి చెందిన బోగారపు నగేష్‌.. సోమయ్యను వెంబడించాడు. తనకు రూ.20లు ఇవ్వాలని అడిగాడు. డబ్బు ఇవ్వడానికి సోమయ్య నిరాకరించగా.. నగేష్‌ తన వద్ద ఉన్న గొడ్డలితో సోమయ్య మెడపై దాడి చేశాడు. అనంతరం ఓ కత్తితో సోమయ్య తల, మొండెం వేరు చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, మద్యానికి బానిసైన నగేష్‌... రెబ్బెన, పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ అందరి వద్ద డబ్బులు అడుగుతూ మద్యం తాగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Jul 18 , 2026 | 06:39 AM