Share News

మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:03 AM

వారి స్నేహాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. సేహితులు ముగ్గురినీ రోడ్డు ప్రమాదం రూపం లో బలితీసుకుంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం...

మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

  • రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

  • బైక్‌పై వెళుతుండగా ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

ఎలమంచిలి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): వారి స్నేహాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. సేహితులు ముగ్గురినీ రోడ్డు ప్రమాదం రూపం లో బలితీసుకుంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర కథనం మేరకు.. ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని (24), ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఎలపా గోవింద్‌ (25), పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బంగారు దుర్గాప్రసాద్‌ (16) స్నేహితులు. చుట్టుపక్కల గ్రామాల్లో పెయింటింగ్‌ పనులు చేస్తుంటారు. గురువారం పురుషోత్తపురంలో గ్రామ దేవత గొల్లమ్మ తల్లి జాతర జరిగింది. గోవింద్‌ అత్తవారి ఊరుకావడంతో అతను అక్కడికి వచ్చాడు. నాని ఆహ్వానం మేరకు దుర్గాప్రసాద్‌ కూడా పురుషోత్తపురం వచ్చాడు. ముగ్గురూ జాతరలో ఉత్సాహంగా గడిపారు. రాత్రి 11.40 గంటల సమయంలో దుర్గాప్రసాద్‌ను అతని ఇంటి వద్ద దించేందుకు ముగ్గురూ కలిసి బైక్‌పై పోతిరెడ్డిపాలెం బయలుదేరారు. తుని నుంచి అనకాపల్లి వెళ్లే మార్గంలో ప్రయాణిస్తున్న వీరు పోతిరెడ్డిపాలెం జంక్షన్‌ వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా అనకాపల్లి నుంచి తుని వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బలంగా ఢీకొంది. దీంతో బైక్‌పై వున్న ముగ్గురూ ఎగిరి రోడ్డుపైపడి, తీవ్రంగా గాయపడ్డారు. రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర, సిబ్బంది.. నానీని 108 అంబులెన్స్‌లో, మిగిలిన ఇద్దరిని హైవే పెట్రోలింగ్‌ అంబులెన్స్‌లో ఎక్కించి అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లేసరికి నాని మృతి చెందడంతో అంబులెన్స్‌ను ఎలమంచిలి సీహెచ్‌సీకీ మళ్లించి, మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. మిగిలిన ఇద్దరినీ అనకాపల్లి తరలిస్తుండగా గోవింద్‌ దారిలోనే ప్రాణాలు కోల్పోగా.. దుర్గాప్రసాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - Apr 04 , 2026 | 04:05 AM