రాష్ట్రంలో వడదెబ్బతో ఐదుగురి మృతి
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:33 AM
రాష్ట్రంలో ఆదివారం వడదెబ్బకు ఐదుగురు, పిడుగుపాటుకు గురై ముగ్గురు చనిపోయారు. పెద్దపల్లి, జగిత్యాల, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ఐదుగురు వడదెబ్బ తగిలి మరణించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగులకు ముగ్గురు బలి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో ఆదివారం వడదెబ్బకు ఐదుగురు, పిడుగుపాటుకు గురై ముగ్గురు చనిపోయారు. పెద్దపల్లి, జగిత్యాల, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ఐదుగురు వడదెబ్బ తగిలి మరణించారు. వీరిలో ఒక రైతు, ముగ్గురు కూలీలు ఉన్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లావ్యాప్తంగా సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగులు పడడంతో చేలల్లో ఉన్న ముగ్గురు మృతిచెందారు. తిర్యాని మండలానికి చెందిన టేకం భీము (42), టేకం రాజుబాయి(37) దంపతులు రెబ్బెన మండలం ఖైరిగూడలో వ్యవసాయ పనులకు వెళ్లారు. చేనులో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం మొదలైంది. పని ఆపేసి సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. ఆ చెట్టుపై పిడుగుపడడంతో భీము దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆసిఫాబాద్ మండలం కౌటగూడ(జి) గ్రామానికి చెందిన పెందూరు లింగు (50) కూడా వర్షం మొదలవ్వడంతో వ్యవసాయ పనులు ఆపివేసి సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాడు. ఆ చెట్లుపై పిడుగుపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు.