Share News

నీ దగ్గరకే వచ్చేస్తాం!

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:40 AM

వృద్ధాప్యంలో కొండంత అండ అనుకున్న కొడుకే అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. ఇది ఆ దంపతులు తట్టుకోలేకపోయారు.

నీ దగ్గరకే వచ్చేస్తాం!

  • కొడుకు మరణాన్ని తట్టుకోలేక చనిపోవాలని ఓ తండ్రి నిర్ణయం

  • భార్య గొంతు కోసి.. తానూ కోసుకున్న వైనం

  • భార్య మృతి.. భర్తకు చికిత్స.. తూర్పుగోదావరిలో దారుణం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): వృద్ధాప్యంలో కొండంత అండ అనుకున్న కొడుకే అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. ఇది ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. బిడ్డ దగ్గరికే వెళ్లిపోవాలని ఆ తండ్రి భార్యను చంపేశాడు.. తానూ ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నంలో ఉండగా జనం అడ్డుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం వడ్డీలపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. కోట నూకరాజు, సుబ్బలక్ష్మి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. భార్యకు కరోనా తర్వాత గుండె శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచీ ఆమెకు నెలకు రూ.6 వేలు, తనకు రూ.వెయ్యి ఆస్పత్రి ఖర్చులవుతున్నాయి. ఇలా ఉండగా.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న కొడుకు శ్రీనివాస ఆంజనేయులు(32) గుండెపోటుతో గత నెల 28న అకస్మాత్తుగా మృతిచెందాడు. దంపతులిద్దరూ కుంగిపోయారు. కొడుక్కి ఇద్దరు కుమార్తెలు. మరోవైపు నూకరాజుకు ఆరోగ్యం బాగోక వ్యాపారానికి వెళ్లడం లేదు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంటి తలుపులు, కిటికీలు మూసేశాడు. గమనించిన మనుమరాలు చుట్టుపక్కల వాళ్లను పిలవడానికి పరిగెత్తింది. ఈలోపు సుబ్బలక్ష్మి(64)ని కింద పడేసి పొట్టపై కూర్చుని కూరగాయలు కోసే కత్తితో పీక కోసేశాడు. రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకొని ఆమెప్రాణాలు వదిలింది. నూకరాజు కూడా పీక కోసుకునే యత్నంలో ఉండగా తలుపులు తోసుకొని జనం వచ్చారు. అతడిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గొంతుపై 3కుట్లు పడ్డాయి. తనను, భార్యనూ చూసేవాళ్లు ఎవరూ లేరని, అందువల్ల చనిపోయి కొడుకు దగ్గరకే వెళ్లిపోదామని అనుకున్నానని నూకరాజు కన్నీటిపర్యంతమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీతానగరం ఎస్‌ఐ వినయ్‌ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Apr 14 , 2026 | 06:41 AM