బాలికపై గ్యాంగ్‌రేప్
ABN , Publish Date - May 21 , 2026 | 03:53 AM
ఓ యువకుడు బాలికపై కన్నేసి.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కొన్నాళ్లకు తన స్నేహితుడితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు.
ఇద్దరు యువకుల దుర్మార్గం
వీడియో తీసి బ్లాక్‌మెయిల్
నిందితులపై పోక్సో కేసు
దుండిగల్, మే 20 (ఆంధ్రజ్యోతి): ఓ యువకుడు బాలికపై కన్నేసి.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కొన్నాళ్లకు తన స్నేహితుడితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణాన్నంతా వీడియో తీసి.. దాని ఆధారంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తుండటంతో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో ఘోరం బయటపడింది. నిందితుడు దుండిగల్‌కు చెందిన దార శివకుమార్ అలియాస్ మట్టు (20). పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శివకుమార్ కొన్నాళ్లుగా దుండిగల్‌లోని రెండు పడక గదుల ఇళ్ల వద్ద ఉన్న ఓ షామియానా దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆ షాపు ముందు నుంచి వెళుతున్న ఓ బాలికపై అతడి కన్ను పడింది. బాలిక కదలికలపై కన్నేసిన అతడు, గత ఏడాది సెప్టెంబరులో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను తీవ్రస్థాయిలో బెదిరించాడు. ఫలితంగా ఆమె మౌనంగా ఉండిపోయింది. కొన్ని నెలల తర్వాత తన స్నేహితుడు, దుండిగల్‌కే చెందిన నిజాంపేట రాము అలియాస్ రాము (30)తో కలిసి శివ కుమార్ బాధిత బాలికపై అత్యారం చేశాడు. ఈ ఘటననంతా ఫొటోలు, వీడియోలు తీసి.. తాము చెప్పినప్పుడల్లా రావాలని వేధింపులకు గురిచేశారు. వేధింపులు పెరగడంతో బాధిత బాలిక, తల్లిదండ్రులకు చెప్పుకొని భోరుమంది. వారు 17న బాలికను వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 20న ఇద్దరు నిందితులైన శివ, రాముపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.