భార్య కేసు పెట్టిందన్న మనస్తాపంతో వైద్యుడి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:24 AM
భార్యతో తలెత్తిన విభేదాలతో విరక్తి చెందిన ఓ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
కీసర రూరల్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): భార్యతో తలెత్తిన విభేదాలతో విరక్తి చెందిన ఓ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన వైద్యుడు జోసెఫ్ వినోద్‌కుమార్(40)కు 18 ఏళ్ల కిందట వీణపాణితో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం కాగా, వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం జోసెఫ్ వినోద్‌కుమార్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేస్తూ భార్యాపిల్లలతో కలిసి దమ్మాయిగూడ డివిజన్ అహ్మద్‌గూడలోని శ్రీఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. అయితే, కొంత కాలంగా భార్యాభర్తల మధ్య ఆర్థిక సంబంధమైన విషయాల్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ మేరకు పలు పోలీస్ స్టేషన్లలో భర్తపై వీణపాణి ఫిర్యాదులు చేసింది. ఈ క్రమంలోనే మార్చి 31వ తేదీన వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరగ్గా, కీసర పోలీస్‌స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై విచారించేందుకు అదే రోజు జోసె్‌ఫను కీసర పోలీసులు పీఎ్‌సకు పిలిచారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం తన కారులో ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులోని రాంపల్లిదాయర సమీపంలోకి చేరుకున్న జోసెఫ్.. గుర్తుతెలియని ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.