డిజిటల్ అరెస్టు పేరుతో రూ.35 లక్షల దోపిడీ
ABN , Publish Date - Apr 17 , 2026 | 05:20 AM
డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి రూ.35 లక్షలు కొల్లగొట్టారు. బాపట్ల జిల్లా అమృతలూరులో జరిగిన ఈ ఘటన వివరాలను గురువారం పోలీసులు మీడియాకు వివరించారు.
బాధితుడు విశ్రాంత ఉపాధ్యాయుడు
అమృతలూరు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి రూ.35 లక్షలు కొల్లగొట్టారు. బాపట్ల జిల్లా అమృతలూరులో జరిగిన ఈ ఘటన వివరాలను గురువారం పోలీసులు మీడియాకు వివరించారు. అమృతలూరుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బన్నారావూరి రామబ్రహ్మంకు కర్ణాటక, తెలంగాణ పోలీసులమంటూ గత నెల 24న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ‘మీరు వాడే సిమ్ కార్డు ద్వారా మహిళలకు అసభ్యకర సందేశాలు వెళ్లాయి. బెంగళూరులో కేసు నమోదైంది. అలాగే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.కోట్లు మోసం చేసిన సదఖత్ ఖాన్ విచారణలో మీ పేరుతో ఉన్న సిమ్‌కార్డు ఉంది. ఈ నేరాల ద్వారా రూ.75 లక్షలు మీ ఖాతాలో జమైంది. మీరిప్పుడు డిజిటల్ అరెస్టులో ఉన్నారు’ అని బెదిరించారు. వారి మాయమాటలు నమ్మిన రామబ్రహ్మం గత నెల 30న హైదరాబాద్ వనస్థలిపురంలో బెల్లం యాదగిరి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాకు రూ.25 లక్షలు, ఈ నెల 6న నెల్లూరుకు చెందిన యల్లంకి హేమ బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు జమ చేశారు. మళ్లీ ఈ నెల 7న ఫోన్ చేసి.. మీ కేసు సుప్రీంకోర్టుకు వెళుతోందని, అక్కడ మీ తరఫున వాదించడానికి సెక్యూరిటీ డిపాజిట్ కింద మరో 24 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పక్కనే ఉన్న రామబ్రహ్మం భార్య కూడా భయాందోళనలకు గురయ్యారు. రామబ్రహ్మంను కొద్దిరోజులుగా గమనిస్తున్న స్నేహితుడు.. ఆరా తీసి.. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని తెలిపారు. ఆ స్నేహితుడి సూచనతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను పట్టుకుంటామని ఎస్‌ఐ సుమన్ తెలిపారు.