డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి రూ.1.07 కోట్లు వసూలు
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:08 AM
డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.1.07 కోట్లు వసూలు చేసిన ఓ ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశామని సిటీ సైబర్ క్రైం డీసీపీ వి. అరవింద్ బాబు తెలిపారు.
బ్యాంకు ఖాతాలు సరఫరా చేస్తున్న ఢిల్లీ ముఠా అరెస్ట్
నిందితులపై పలు రాష్ట్రాల్లో కేసులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.1.07 కోట్లు వసూలు చేసిన ఓ ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశామని సిటీ సైబర్ క్రైం డీసీపీ వి. అరవింద్ బాబు తెలిపారు. సైబర్ నేరగాళ్లు కాజేసిన సొత్తును బదిలీ చేయడంతోపాటు బ్యాంకు ఖాతాలు ఇచ్చి సహకరిస్తున్న ఢిల్లీకి చెందిన ముగ్గురు సభ్యులకు గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నమోదైన పలు సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. ఢిల్లీకి చెందిన మనీ ఎక్స్ఛేంజ్, ట్రావెల్ వ్యాపారి గుర్దీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్, ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న హర్ ప్రీత్ సింగ్ అలియాస్ కరణ్ కౌశిక్, వ్యాపారి కుమార్ మోహిత్ అలియాస్ మోహిత్ కౌశిక్‌లు ముఠాగా ఏర్పడ్డారు. వీరికి సైబర్ నేరగాళ్లతో సంబంధాలు ఉండటంతో బ్యాంకు ఖాతాలు సరఫరా చేసే ఏజెంట్లుగా మారారు. అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాలు తీసుకొని సైబర్ నేరాలకు వినియోగిస్తున్నారు. నగరానికి చెందిన బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని, బాధితుడి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ అక్రమ కార్యకలాపాల్లో వినియోగించినట్లు చెప్పారు. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయని భయపెట్టారు. విచారణ పేరుతో భయపెట్టి పలు దఫాలుగా రూ.1.07 కోట్లు వేర్వేరు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్ క్రైం అధికారులు ఖాతాదారులు దీపక్, ప్రశాంత్ కుమార్‌లను గతంలోనే అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు ప్రధాన ఖాతా సరఫరాదారులు హర్‌ప్రీత్ సింగ్, కుమార్ మోహిత్, గుర్దీప్ సింగ్‌లను అరెస్ట్ చేశారు.
హోటళ్లలో బస.. అమాయకులపై వల
నిందితులు ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని హోటళ్లలో బస చేస్తారు. డబ్బులు అవసరం ఉన్నవారిని గుర్తించి వారికి కమీషన్ ఆశ చూపి వారి బ్యాంకు ఖాతాలను సేకరిస్తారు. తాము కాజేసిన డబ్బును ఈ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. ఈ ముగ్గురు నిందితులు ఇలా వచ్చే డబ్బును వెంటనే ప్రధాన సూత్రధారికి బదిలీ చేస్తారు. ఖాతాలు ఇచ్చిన వారికి కొంత కమిషన్ ఇచ్చి, తాము మరికొంత కమిషన్ తీసుకుంటారు. నిందితుల ఫోన్‌లలో అనేక బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు గుర్తించారు. అపరిచితులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వవద్దని ఇలా చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని సిటీ సైబర్ క్రైం డీసీపీ వి. అరవింద్ బాబు తెలిపారు. కొత్త వారికి వ్యక్తిగత వివరాలు, ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలను చెప్పకూడదన్నారు.