Crimes Against Children: నేరాల మధ్య నలుగుతున్న బాల భారతం
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:55 AM
దేశంలో బాలలపై పెరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు దశాబ్దాల కాలంలో బాలలపై నేరాలు ఏకంగా 12 రెట్లు పెరిగాయి.
దేశంలో పిల్లలపై పెరిగిపోతున్న నేరాలు
రెండు దశాబ్దాల్లో 12 రెట్లు అధికం
తాజా నివేదికలో ఎన్‌సీఆర్‌బీ వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 18: దేశంలో బాలలపై పెరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు దశాబ్దాల కాలంలో బాలలపై నేరాలు ఏకంగా 12 రెట్లు పెరిగాయి. రోజుకు సగటున 40 కేసుల నుంచి ఇప్పుడు సుమారు 500 కేసులకు ఆ నేరాలు చేరుకున్నాయి. 2004-2023 వరకు ఎన్‌సీఆర్‌బీతాజా డేటా ప్రకారం బాలలపై నేరాలు భారీగా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 2004లో 14,423 కేసులు నమోదైతే 2023లో 1.77 లక్షలు కేసులు నమోదవ్వడం ఆందోళనకు కారణమవుతోంది. కొవిడ్ అనంతర కాలంలో అయితే బాలల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. 2020-2023 మధ్య కేసులు ఏకంగా 40ు పెరిగాయి. 2001 నుంచి మాత్రమే ఎన్‌సీఆర్‌బీ బాలలపై కేసులను ప్రత్యేకంగా లెక్కిస్తోంది. 2014-23 మధ్య కాలంలో కేసులను చూస్తే, కేవలం ఆరు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కేసులు నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఆ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, బిహార్ ఉన్నాయి. 2014-23 మధ్య కాలంలో 1.77 లక్షల కేసులతో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో, 1.66 లక్షల కేసులతో మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉన్నాయి. 2023లో కూడా 22,393 కేసులతో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలోనే ఉంది. దశాబ్ద కాలంలో అస్సాంలో కేసులు ఏకంగా ఏడు రెట్లు పెరిగాయి. 2014లో ఆ రాష్ట్రంలో కేవలం 1,385 కేసులు మాత్రమే నమోదవ్వగా, 2023లో ఆ సంఖ్య 10,174కు పెరిగింది. ఈ దబాబ్ద కాలంలో అస్సాంలో బాలలపై నేరాల కేసులు 49,352గా ఉన్నాయి. బిహార్‌లో అయితే కేసులు ఐదు రెట్లు పెరిగాయి. 2014లో 2,255గా ఉన్న కేసులు 2023లో 9,906గా నమోదయ్యాయి. ఇక ఈ దశాబ్ద కాలంలో బిహార్‌లో బాలలపై నేరాలకు సంబంధించి 61,663 కేసులు నమోదయ్యాయి.