Share News

ప్రేమ పెళ్లి.. పోలీసుల ముందే యువకుడిపై దాడి

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:50 AM

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు.. పోలీసులు వారిని ఇంటికి తరలిస్తుండగానే..

ప్రేమ పెళ్లి.. పోలీసుల ముందే యువకుడిపై దాడి

  • యువతిని బలవంతంగా తీసుకెళ్లిన బంధువులు

  • మరో ఘటనలో యువకుడి కిడ్నాప్‌, దాడి

  • మెదక్‌ జిల్లాలో ఘటనలు

మనోహరాబాద్‌/నర్సాపూర్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు.. పోలీసులు వారిని ఇంటికి తరలిస్తుండగానే.. అమ్మాయి తరఫు వారు యువకుడిపై దాడి చేసి, యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. బాధితుడి కథనం మేరకు.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కోనాయిపల్లికి చెందిన చెట్టి సాయినాథ్‌.. మేడ్చల్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరుకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల వారు పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కావాలని మంగళవారం మనోహరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. విచారణ అనంతరం పోలీసులు వారిని మేడ్చల్‌లో వదిలేందుకు తీసుకెళ్తుండగా.. కాళ్లకల్‌లో హైవేపై యువతి తరఫు బంధువులు అడ్డుకున్నారు. పోలీసుల ఎదుటే యువకుడిపై దాడి చేసి, యువతిని తీసుకెళ్లారు. బాధితుడు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని ఆమె బంధువులు కిడ్నాప్‌ చేసి అడవిలోకి తీసుకెళ్లి చితకబాదారు. ప్రస్తుతం అతడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లక్ష్మాతండాకు చెందిన దేవిసింగ్‌.. రెండేళ్లుగా సంగారెడ్డి జిల్లా కంది మండలం బ్యాతోల్‌కు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. విషయం ఇంట్లో తెలిసి యువతికి వరుసకు అన్నలైన వెంకటేశ్‌, నరేశ్‌, కార్తీక్‌, తరుణ్‌ మంగళవారం మధ్యాహ్నం.. ఆమెతోనే దేవిసింగ్‌కు ఫోన్‌ చేయించి నర్సాపూర్‌ బస్టాండ్‌కు రమ్మని చెప్పించారు. ఆ యువకుడు వచ్చి యువతితో మాట్లాడుతుండగా ఆ నలుగురు దేవిసింగ్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని నర్సాపూర్‌-తూప్రాన్‌ మధ్యలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువచ్చారు. అక్కడ అతడిని తీవ్రంగా కొట్టి, గాయపరిచారు. దీంతో స్పృహ కోల్పోయిన యువకుడు చనిపోయాడని భావించి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత యువకుడికి స్పృహ రావడంతో గాయాలతోనే రోడ్డుపైకి వచ్చి ఆటోలో హైదరాబాద్‌ శివారులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో నర్సాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 22 , 2026 | 04:50 AM