Share News

వరంగల్‌లో కాంగ్రెస్‌ నాయకుడి హత్య

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:39 AM

వరంగల్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, సోషల్‌ మీడియా మాజీ కో-ఆర్టినేటర్‌ అడుప మహేశ్‌ (40) హత్యకు గురయ్యారు.

వరంగల్‌లో కాంగ్రెస్‌ నాయకుడి హత్య

  • పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగుడు

  • హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి

వరంగల్‌ సిటీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, సోషల్‌ మీడియా మాజీ కో-ఆర్టినేటర్‌ అడుప మహేశ్‌ (40) హత్యకు గురయ్యారు. వరంగల్‌లోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన మహేశ్‌కు అత్యంత సన్నిహితుడైన జన్ను మధు శనివారం రాత్రి ఫోన్‌ చేసి మద్యం తాగుతూ మాట్లాడుకుందాం కోటిలింగాల గుడి ప్రాంతానికి రావాలని కోరాడు. అక్కడికి వెళ్లిన మహేశ్‌ వద్దకు అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న పత్తి కుమార్‌ అనే మరోవ్యక్తి వచ్చి ‘‘నాపై ఎమ్మెల్యేకు ఏం చెప్పావురా.. లేనిపోనివి అన్నీ చెప్పి ఎమ్మెల్యే నన్ను దూరం పెట్టేలా చేస్తావా..?’’ అంటూ ఆగ్రహంతో మహేశ్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. తర్వాత నిందితులు ఇద్దరు అక్కడి నుంచి పరారు కాగా.. మహేశ్‌ కాలిన గాయాలతోనే ఇంటికు చేరుకుని, కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు జరిగిన విషయం చెప్పారు. వారు వెంటనే మహేశ్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మహేశ్‌ మృతి చెందారు. ఆయన భార్య నాగమణి ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో విశ్వేశ్వర్‌ తెలిపారు. కాగా, ఎంజీఎంకు వెళ్లకముందే మహేశ్‌ తన ఇంటివద్ద మాట్లాడుతూ.. తనపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన పత్తి కుమార్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఓ హత్య కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి పెరోల్‌పై వచ్చి ఇంత దారుణానికి ఒడిగట్టడం దురదృష్టకరమని, ఇప్పటికైనా పోలీసులు కుమార్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంజీఎంలో మహేశ్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్‌. నాగరాజు పరామర్శించారు.

Updated Date - Jul 20 , 2026 | 03:39 AM