చేతులెలా వచ్చాయి ‘దామోదరా’..!
ABN , Publish Date - Jun 23 , 2026 | 04:47 AM
భార్యకు నయం కాని వ్యాధి.. తల్లిని కోల్పోతే ఇద్దరు పిల్లలను ఎలా పెంచాలన్న బెంగ... ఓ భర్తను కుంగదీసింది.
భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఉరి
అటు భార్యకు నయంకాని మెదడు వ్యాధి
ఇటు పిల్లల భవితపై బెంగతో తీవ్రమైన నిర్ణయం
చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో ఘటన
చిత్తూరు రూరల్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): భార్యకు నయం కాని వ్యాధి.. తల్లిని కోల్పోతే ఇద్దరు పిల్లలను ఎలా పెంచాలన్న బెంగ... ఓ భర్తను కుంగదీసింది. మనసును కఠినంగా మార్చింది. జీవితంపై ఆశలు కోల్పోయిన ఆ కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయం.. నలుగురి మరణం!! ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. పలమనేరుకు చెందిన దామోదరం(35) చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లెలో స్థిరపడ్డారు. 14 ఏళ్ల కిందట జీడీ నెల్లూరు మండలం అప్పిరెడ్డి కండ్రిగకు చెందిన నిర్మల(32)తో వివాహమైంది. శ్రీదివ్య (13), దిలీప్ (11) అనే పిల్లలున్నారు. ఏడేళ్ల కిందట నిర్మలకు మెదడు వ్యాధి రాగా, స్తోమతకు మించి రూ.5 లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేశాడు. చివరికి వైద్యులు ఆ వ్యాధికి చికిత్స లేదని, ఆశలు వదులుకోవాలని చెప్పడంతో దామోదరం తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. భార్య ఆరోగ్యం రోజుకోజుకూ క్షీణిస్తున్న క్రమంలో ఆదివారం రాత్రి నిర్మలతో పాటు ఇద్దరు పిల్లలకు జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చాడు. వాళ్లు చనిపోయారని నిర్ధారించుకున్నాక తానూ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. తన మరణానంతర ఏర్పాట్లు ఎవరికీ భారం కాకూడదని దామోదరం భావించి, ఫోన్‌పే, ఏటీఎం కార్డు పిన్ నంబర్లు రాసి టీవీకి అతికించాడు. తన ఖాతాలోని డబ్బులతో తమ దహన సంస్కారాలు పూర్తి చేయాలని రాశాడు.