కాలయముడిగా మారిన కన్నతండ్రి
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:02 AM
ప్రేమగా పెంచుకుంటున్న పిల్లల్ని కన్నతండ్రే అంతమొందించాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కాండూరివారి అగ్రహారంలో శుక్రవారం జరిగింది.
ముగ్గురు కుమార్తెలను హతమార్చి..ఉరివేసుకొని బలవన్మరణం
భార్యతో కలహాల వల్లే!.. ప్రకాశం జిల్లాలో దారుణం
చీమకుర్తి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రేమగా పెంచుకుంటున్న పిల్లల్ని కన్నతండ్రే అంతమొందించాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కాండూరివారి అగ్రహారంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, మృతుడి తల్లి సుశీల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఏకుల సుధాకర్(36)కు ముగ్గురు కుమార్తెలు గోర్షిత(13), పూజిత(11), లోకిత(8) ఉన్నారు. సుధాకర్ భార్య వెంకటేశవరమ్మ భర్తతో విభేదించి గత మూడేళ్లుగా ఆమె పుట్టింటిలో ఉంటోంది. సుధాకర్ తన తల్లి, కూతుర్లతో ఉంటున్నాడు. గురువారం రాత్రి మనవరాళ్లకు అన్నం తినిపించిన సుశీల ఎదురుగా ఉన్న కొట్టంలో నిద్రించటానికి వెళ్లిపోయింది. ఆ సమయంలో సుధాకర్ పిల్లల వద్దే ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఆమె పిల్లల్ని నిద్ర లేపేందుకు ప్రయత్నించగా సుధాకర్ వారించాడు. ‘ఈ రోజు పిల్లలు స్కూల్‌కు వెళ్లరు, లేపవద్దు కాసేపు నిద్రపోనివ్వు’ అన్నాడు. కాసేపటి తర్వాత పిల్లల్ని నిద్రలేపాలని నాయనమ్మ ప్రయత్నించగా ఉలుకు పలుకూ లేకుండా ఉండటం గమనించి పక్కనున్న వారిని పిలిచింది. అప్పటికే పిల్లలు మృతిచెందారని గుర్తించారు. ఆ కాసేపటికే ఊరి చివర పొలాల్లో చెట్టుకు సుధాకర్ ఉరి వేసుకున్నట్టు గ్రామస్థులు గుర్తించారు. కాగా.. సుధాకర్ విడాకుల కేసు ఈ నెల 22న విచారణకు రానుంది. పిల్లలను తన వద్దకే పంపాలని కోర్టు ద్వారా అతని భార్య కోరుతోంది. ఈ విషయమై ఎక్కువగా ఆలోచించి ఇంతటి దురాగతానికి పాల్పడ్డాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. చెట్టుకు వేలాడుతున్న సుధాకర్ చేతిలో కత్తి ఉండటం మిస్టరీగా మారింది.