బాలికపై చర్చి పాస్టర్ కుటుంబం దాష్టీకం
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:30 AM
ఇంట్లో పని చేసే బాలిక డబ్బులు తీసిందన్న అనుమానంతో చర్చి పాస్టర్ కుటుంబం అట్లకాడతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన..
దొంగతనం చేసిందనే అనుమానంతో చిత్రహింసలు
అట్లకాడ కాల్చి చేతులపై వాతలు.. అల్లూరి జిల్లాలో ఘటన
సీలేరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఇంట్లో పని చేసే బాలిక డబ్బులు తీసిందన్న అనుమానంతో చర్చి పాస్టర్ కుటుంబం అట్లకాడతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం ధారకొండలో జరిగింది. ఈ నెల 26న ఈ సంఘటన జరగ్గా, బాలిక తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... ధారకొండ ఏనుగుబైలుకు చెందిన గెమ్మెలి వసంత (8) గత పది నెలలుగా ధారకొండ చర్చి పాస్టర్ గొర్లి జయరాజ్ ఇంట్లో పనులు చేస్తున్నది. ఇంట్లో రూ.10 వేలు కనిపించకపోవడంతో నువ్వే తీశావంటూ ఆ బాలికను పాస్టర్, ఆయన సతీమణి, ఇంటి పక్కన ఉండే ఈశ్వరరావు, అతని భార్య రూప ఈ నెల 26వ తేదీన చిత్రహింసలకు గురిచేశారు. బాలికను దారుణంగా కొట్టడంతోపాటు అట్లకాడ కాల్చి చేతులపై వాతలు పెట్టారు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని బలవంతం చేసి, ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. తమ కుమార్తెను ధారకొండ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఆదివారం సీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.