టీ తాగుదామని తీసుకువెళ్లి అత్యాచారం
ABN , Publish Date - May 19 , 2026 | 04:52 AM
టీ తాగుదామని సహచర విద్యార్థినిని ఇంటి నుంచి తీసుకువెళ్లిన బీటెక్ విద్యార్థి అనంతరం ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బీటెక్ విద్యార్థినిపై సహచర విద్యార్థి ఘాతుకం.. నిందితుడికి రిమాండ్
ఇబ్రహీంపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి) : టీ తాగుదామని సహచర విద్యార్థినిని ఇంటి నుంచి తీసుకువెళ్లిన బీటెక్ విద్యార్థి అనంతరం ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని సోమవారం రిమాండ్‌కు పంపారు. సీఐ ఎం.మహేందర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన ఉడుతల ఉదయ్(20) ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న క్లాస్‌మేట్ అయిన యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న అతను ఈ నెల 14న రాత్రి టీ తాగడానికని ఆ యువతిని ఇంటి నుంచి కారులో నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌కు తీసుకెళ్లాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో మార్గం మధ్యలో మద్యం కొనుగోలు చేశాడు. ఇబ్రహీంపట్నం సమీపంలోని బీడీఎల్ రోడ్డులో యువతికి బలవంతంగా మద్యం తాగించి తానూ తాగాడు. అదే రాత్రి మద్యం మత్తులో ఆ యువతిని ఇబ్రహీంపట్నంలోని ఓ గదికి తీసుకువచ్చి అత్యాచారం చేశాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం నిందితుణ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.