అవమానించారని తమ్ముడు, మరదలి హత్య
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:31 AM
తీసుకున్న అప్పు చెల్లించక పోగా.. పిల్లల్లేరని, సంసారానికి పనికి రావని వ్యాఖ్యానించిన తమ్ముడి దంపతులపై కోపంతో మృగంలా మారి వారిని కత్తితో పొడిచి దారుణ హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని......
చార్మినార్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): తీసుకున్న అప్పు చెల్లించక పోగా.. పిల్లల్లేరని, సంసారానికి పనికి రావని వ్యాఖ్యానించిన తమ్ముడి దంపతులపై కోపంతో మృగంలా మారి వారిని కత్తితో పొడిచి దారుణ హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని మీర్‌చౌక్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. మృతురాలు నాలుగు నెలల గర్భవతి కావడం గమనార్హం. మృతుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిల్‌ఖాన్, ఆఖిల్‌ఖాన్ అన్నదమ్ములు. అఖిల్‌ఖాన్, అజ్మీరా బేగం దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లున్నారు. సంతానం లేని ఆదిల్‌ఖాన్ వద్ద ఆఖిల్‌ఖాన్ తన అవసరాలకు డబ్బు తీసుకుని ఇస్తుండే వాడు. కానీ నాలుగు నెలల కిత్రం తీసుకున్న డబ్బు ఇవ్వడంలో జాప్యం కావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. డబ్బు విషయంలో గొడవ జరిగినప్పుడల్లా ఆదిల్‌ఖాన్‌ను సంసారానికి పనికి రావంటూ ఆఖిల్‌ఖాన్, అజ్మీరా బేగం అవమానించే వారు. దీంతో తమ్ముడిని, మరదల్ని అంతం చేసేందుకు ఆదిల్‌ఖాన్ పథకం వేశాడు. సోమవారం సాయంత్రం ఉస్మాన్‌పురా నూర్‌ఖాన్ బజార్‌లోని తమ్ముడింటికి వచ్చి డబ్బులడగడంతో మాటా మాటా పెరిగింది. ఆదిల్‌ఖాన్ తనతో తెచ్చుకున్న కత్తితో ఆఖిల్‌ఖాన్‌పైనా, అడ్డు వచ్చిన మరదలు అజ్మీరా బేగంపైనా విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఆఖిల్‌ఖాన్ దంపతులు ఘటనా స్థలంలోనే మరణించారు. హంతకుడ్ని త్వరలోనే పట్టుకుంటామని శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. ఈ ఘటనతో తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు పిల్లలు అనాథలయ్యారు.