Share News

అక్కను చంపి.. రెండు ముక్కలు చేసి..

ABN , Publish Date - Mar 19 , 2026 | 03:49 AM

తోబుట్టువులుగా ఇద్దరు కలిసి కొనుగోలు చేసిన 120 గజాల గృహంలో తన భాగాన్ని ఇవ్వాలని అడిగినందుకు సొంత అక్కను మరో ఇద్దరితో కలిసి చంపేశాడా తమ్ముడు.

అక్కను చంపి.. రెండు ముక్కలు చేసి..

  • మృతదేహాన్ని చెరువులో పడేసిన తమ్ముడు

  • 120 గజాల ఇంటిలో భాగం అడిగినందుకే బాటసింగారంలో దారుణ ఘటన

అబ్దుల్లాపూర్‌మెట్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): తోబుట్టువులుగా ఇద్దరు కలిసి కొనుగోలు చేసిన 120 గజాల గృహంలో తన భాగాన్ని ఇవ్వాలని అడిగినందుకు సొంత అక్కను మరో ఇద్దరితో కలిసి చంపేశాడా తమ్ముడు. తర్వాత మృతదేహాన్ని రెండ్రోజులు ఇంట్లోనే దాచిపెట్టి.. రెండు ముక్కలుగా నరికి సమీపంలోని చెరువులో పడేశాడు. వారం రోజులకు అక్క కనిపించడం లేదంటూ అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో తమ్ముడే హత్య చేసినట్లు బయటపడింది. ఈ ఘటన నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటసింగారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ జిల్లా హరిదానా గ్రామానికి చెందిన పప్పురామ్‌ కుమావత్‌ ఏడాదిన్నర క్రితం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం గ్రామానికి వలస వచ్చాడు. అక్కడ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అతడి అక్క లీలాదేవి కుమావత్‌(40), భర్త పదేళ్ల క్రితం చనిపోవడంతో తమ్ముడితో కలిసి కిరాణషాపు చూసుకుంటోంది. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం అక్క, తమ్ముడు కలిసి బాటసింగారంలో 120 గజాల ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటిని పప్పురామ్‌ ఒక్కడే తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. కొంత కాలంగా లీలాదేవి ఆ ఇంటిలో తన తాలూకు వాటాను తనకు ఇవ్వాలని పప్పురామ్‌ను అడుగుతూ వస్తోంది. ఇందుకు అతడు ఒప్పుకోవడం లేదు. అక్క నుంచి ఒత్తిడి పెరగడంతో ఆమెను హత్యచేసి, ఆ ఇంటిని తానొక్కడే దక్కించుకునేందుకు పప్పూరామ్‌ పథకం వేశాడు. ఇందుకు కిరాణా షాపులో పని చేస్తున్న రాకేశ్‌ కుమావత్‌, పక్కనే మిర్చి బండి నిర్వహిస్తున్న సునీల్‌కుమార్‌ సహకారం తీసుకున్నాడు. గత నెల 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముగ్గురు కలిసి లీలాదేవి తలపై కర్రతో కొట్టి చంపారు. అనంతరం మృతదేమాన్ని ఓ సంచీలో కుక్కి నిరుపయోగంగా ఉన్న బాత్‌రూమ్‌లో దాచిపెట్టారు. మార్చి2న రాత్రి కారులో ముగ్గురు కలిసి మృతదేమాన్ని మజీద్‌పూర్‌ గ్రామ పరిధిలోని చెరువు వద్దకు తీసుకెళ్లారు. వెంట తీసుకెళ్లిన రంపంతో మృతదేహాన్ని నడుము భాగం వద్ద రెండు ముక్కలుగా కోశారు. నడుం నుంచి పై భాగాన్ని సంచీలో కుక్కి చెరువు తూంలో పడేశారు. నడుం కింది భాగాన్ని ప్లాస్టిక్‌ కవర్‌లో కట్టి చెరువులో పడేశారు. ఆ రంపాన్ని కూడా చెరువులో వేశారు. ఈ నెల 8న అక్క లీలాదేవి కనిపించడం లేదంటూ పప్పూరామ్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అక్కకు ఇతర వ్యక్తులతో సంబంధం ఉందని, రాజస్థాన్‌ వెళ్లిపోయి ఉంటుందని పోలీసులకు తెలిపాడు. లీలాదేవి పిల్లలకు కూడా ఆమె రాజస్థాన్‌ వెళ్లిందని చెప్పి నమ్మించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు పప్పురామ్‌ తీరుపైనే అనుమానం వచ్చింది. బుధవారం అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా 120 గజాల ఇంటి విషయంలో తనపై వత్తిడి తీసుకురావడంతోనే మరో ఇద్దరితో కలిసి ఆమెను చంపేశానని చెప్పాడు. ఘటనను హత్య కేసుగా మార్చిన పోలీసులు చెరువులోంచి మృతదేహాన్ని బయటకుతీసి పోస్టుమార్టమ్‌కు పంపారు. హత్యకు సహకరించిన రాకేశ్‌ కుమావత్‌, సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 03:49 AM