విశాఖలో దంపతుల ఉసురు తీసిన బిర్యానీ
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:18 AM
బిర్యానీ కోసం తలెత్తిన వివాదం దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ వివాదంతో మనస్తాపం చెందిన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా..
బిర్యానీ కోసం ఇద్దరి మధ్య వివాదం
మనస్తాపంతో ఉరేసుకున్న భార్య
భయంతో భర్త కూడా బలవన్మరణం
నాలుగేళ్ల కుమారుడి కళ్లెదుటే ఘోరం
విశాఖ నగరంలో విషాదం
సీతంపేట (విశాఖపట్నం), జూన్ 8(ఆంధ్రజ్యోతి): బిర్యానీ కోసం తలెత్తిన వివాదం దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ వివాదంతో మనస్తాపం చెందిన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. అది గమనించిన భర్త కూడా భయంతో నాలుగేళ్ల కుమారుడి కళ్లెదుటే బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ నగరంలోని శ్రీనగర్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ప్రాంతానికి చెందిన దిరగాసి బలరాం(33), ప్రియాంక(27) ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చి రామాటాకీస్ సమీపంలోని శ్రీనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ప్రియాంక తల్లి రాజేశ్వరి కూడా వారితోపాటే ఉంటోంది. బలరాం వెల్డింగ్ పనులకు వెళుతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మద్యం తాగడానికి బయటకు వెళ్లిన బలరాం.. రాత్రి పది గంటలకు భార్యకు ఫోన్ చేసి తనకు బిర్యానీ తెచ్చి ఉంచాలని చెప్పాడు. దాంతో వారిద్దరి మధ్య ఫోన్‌లోనే వాగ్వాదం జరిగింది. దీంతో ‘ఇంటికి వచ్చాక నీ పని చెబుతాను’ అని ప్రియాంకను బలరాం గదమాయించాడు. బిర్యానీ కోసం గొడవ ఎందుకులే అని ప్రియాంక తల్లి కొని తేవడానికి బయటకు వెళ్లింది. ఫోన్‌లో గొడవతో మనస్తాపం చెందిన ప్రియాంక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి ప్రియాంకకు ఫోన్ చేసిన బలరాం... ఆమె బదులివ్వకపోవడంతో ఇంటికి వచ్చాడు. ఆమె ఉరికి వేలాడడం చూసి కిందికు దింపాడు.
అప్పటికే ఆమె మృతి చెందడంతో భయపడిన బలరాం.. తాను కూడా అదే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికే బిర్యానీ తీసుకొచ్చిన ప్రియాంక తల్లి రాజేశ్వరి తన కుమార్తె మంచం వద్ద మృతిచెంది ఉండడం, అల్లుడు ఉరేసుకుని చనిపోయి ఉండడం చూసి స్థానికుల సాయంతో ద్వారకా పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ అసిరితాత.. దంపతుల నాలుగేళ్ల కుమారుడిని ఏం జరిగిందని ప్రశ్నించారు. ‘ముందుగా అమ్మ ఊయల ఊగింది. తర్వాత నాన్న వచ్చి అమ్మను పడుకోబెట్టాడు. ఆ తర్వాత నాన్న కూడా ఊయల ఊగాడు’ అని చెప్పాడు. రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.