Share News

సహజీవనం వద్దన్నారని తల్లి, తండ్రి, చెల్లిని చంపేసింది

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:43 AM

కుమార్తె సహజీవనాన్ని వ్యతిరేకించడమే ఆ తల్లిదండ్రులు చేసిన నేరమైంది..! ప్రియుడితో కలిసి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న ఆమెను మందలించడమే వారు చేసిన పాపమైంది..

సహజీవనం వద్దన్నారని తల్లి, తండ్రి, చెల్లిని చంపేసింది

  • బెంగళూరు నగరంలో ప్రియుడితో కలిసి యువతి దారుణం

మహదేవపుర, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కుమార్తె సహజీవనాన్ని వ్యతిరేకించడమే ఆ తల్లిదండ్రులు చేసిన నేరమైంది..! ప్రియుడితో కలిసి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న ఆమెను మందలించడమే వారు చేసిన పాపమైంది..! తన మంచికే చెబుతున్నారన్న విచక్షణ మరిచి.. అమ్మనాన్నలపై కోపంతో ఊగిపోయింది. ప్రియుడితో కలిసి తల్లిదండ్రులతోపాటు తన చెల్లిని కూడా కత్తితో పొడిచి కడతేర్చింది. ఈ దారుణ సంఘటన బెంగళూరు నగరంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు... శీగేహళ్లి డొమినిక్‌ లే అవుట్‌లోని సాయి గ్రీన్‌హోమ్స్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సోమసుందర్‌ (52), ముత్తులక్ష్మి (48) దంపతులకు శ్వేత, సుప్రియ (19) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్వేత... కెన్నెత్‌ అనే యువకుడితో రెండు నెలలుగా సహజీవనం చేస్తోంది. దీన్ని శ్వేత తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అలాగే శ్వేత రూ.30 లక్షల వరకూ అప్పులు చేసినట్టు తెలిసింది. దీని గురించి తల్లిదండ్రులు ప్రశ్నిస్తుండడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. సోమవారం రాత్రి కెన్నెత్‌తో కలిసి శ్వేత.. తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. ఆ సమయంలో ముత్తులక్ష్మి మాత్రమే ఇంట్లో ఉన్నారు. అప్పుడు ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, దీంతో కోపోద్రిక్తులైన శ్వేత, కెన్నెత్‌ కలిసి కత్తితో దాడి చేసి ముత్తులక్ష్మిని హత్య చేశారు. ఆ తర్వాత రక్తపు మరకలు కడిగేశారు. కొద్దిసేపటికి సోమసుందర్‌, ఆయన చిన్న కుమార్తె సుప్రియ ఇంటికి వచ్చారు. సుప్రియ లోపలికి రాగానే శ్వేత ఆమెను పట్టుకోగా.. కెన్నెత్‌ కత్తితో ఆమెపై దాడిచేసి హతమార్చాడు. ఆ తర్వాత అదే ఆయుధంతో సోమసుందర్‌పైనా దాడిచేసి విచక్షణా రహితంగా పొడిచాడు. వారిదాడి నుంచి తప్పించుకున్న సోమసుందర్‌ అపార్ట్‌మెంట్‌ బయటకు వచ్చి సహాయం కోసం అర్థించారు. స్థానికులు గమనించి వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పరారీలో ఉన్న శ్వేత, కెన్నెత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - Jun 24 , 2026 | 03:43 AM