Share News

ఉరేసుకున్న భర్త..17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:26 AM

అతడు, ఆమె బాల్యస్నేహితులు.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాక మనసులు కలిశాయి! పెళ్లి చేసుకొని రెండేళ్లుగా ఒకేగూటికింద ఉంటున్నారు.

ఉరేసుకున్న భర్త..17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య

  • బెంగళూరులో టెకీ దంపతుల ఆత్మహత్య

గజ్వేల్‌, ములుగు, బెంగళూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): అతడు, ఆమె బాల్యస్నేహితులు.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాక మనసులు కలిశాయి! పెళ్లి చేసుకొని రెండేళ్లుగా ఒకేగూటికింద ఉంటున్నారు. ఉన్నట్టుండి అతడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తను ఆ స్థితిలో చూసి హతాశురాలైన ఆమె అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది. బెంగళూరులో జరిగిందీ విషాదం. మృతుడు సిద్దిపేట జిల్లా ములుగు మండలం అన్నాసాగర్‌ గ్రామానికి చెందిన 32 ఏళ్ల కుంట భానుచందర్‌ రెడ్డి! కుమారుడు విదేశాల్లో చక్కగా ఉద్యోగం చేస్తున్నాడనుకుంటున్న భానుచందర్‌ తల్లిదండ్రులకు.. కుమారుడు ఇకలేడన్న వార్త చెవినపడటంతో అతడు బెంగళూరులో ఉండ టం ఏమిటి? ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అని నమ్మలేకపోతున్నారు. భర్త చనిపోయిన వెంటనే ప్రాణాలు విడిచిన ఆమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, మేడ్చల్‌కు చెందిన 31 ఏళ్ల బీబీ షాజియా సిరాజ్‌! భానుచందర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కెనడాలో 12 ఏళ్లు ఉద్యో గం చేశాడు. కొలువు పోవడంతో ఏడాదిన్నర పాటు అక్కడ తీవ్ర ఆర్థిక ఇబ్బందులెదుర్కొన్నాడు. ఎలాగో అలా స్వదేశానికి వచ్చేసినా తల్లిదండ్రులు విజయలక్ష్మి-రఘుపతి రెడ్డికి తాను కెనడాలోనే ఉన్నానంటూ నమ్మిస్తూవచ్చాడు. రెండేళ్ల క్రితం షాజియా సిరాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి బెంగళూరులోని కొత్తనూరులో ఓ ఫ్లాట్‌ తీసుకొని ఉంటున్నాడు. కొన్నాళ్లుగా అతడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. రంజాన్‌కు షాజియా మేడ్చల్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి సోమవారమే తిరిగొచ్చింది. ఉదయం భానుచందర్‌ తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు సాయంతో డోర్స్‌ తీసి లోపలికి వెళ్లింది. అప్పటికే భానుచందర్‌ ఓ గదిలో ఉరికివేలాడుతున్న స్థితిలో ఆమెకు కనిపించాడు. అతడి మృతదేహాన్ని చూసిన షాజియా వెంటనే అపార్ట్‌మెంట్‌ 17వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఫ్లాట్‌లో భానుచందర్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది. తన చావుకు తానే కారణమని, షాజియాను ఏమీ అనొద్దని, ఇందులో ఆమె తప్పు లేదని, ఆరోగ్యం సహకరించక పోవడం వల్లే చనిపోతున్నానంటూ నోట్‌లో భానుచందర్‌ రాశాడు. అయితే భాను, షాజియా మధ్య మనస్పర్థలే ఈ ఘటనకు కారణం అని భావిస్తున్నట్లుగా డీసీపీ మిథున్‌ పేర్కొన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 04:26 AM