‘వెస్టర్న్ స్టైల్’ అంటూ ప్రియుడి కళ్లకు గంతలు..ఆ తర్వాత పెట్రోల్ పోసి యువతి నిప్పు
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:35 AM
ఇంట్లో ఎవరూ లేరంటూ ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అతడు రాగానే ‘సర్‌ప్రైజ్..’ అంటూ కళ్లకు గంతలు కట్టింది. తర్వాత ప్రియుడి ఒంటిపై దుస్తులను...
మంటల్లో కాలిపోతుంటే వీడియో.. బెంగళూరులో ఘటన
బెంగళూరు, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఎవరూ లేరంటూ ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అతడు రాగానే ‘సర్‌ప్రైజ్..’ అంటూ కళ్లకు గంతలు కట్టింది. తర్వాత ప్రియుడి ఒంటిపై దుస్తులను ఒక్కోటి విప్పేస్తూ కుర్చీలో కూర్చోబెట్టింది. కాళ్లు, చేతులు కట్టేసింది. ఎందుకింత గట్టిగా కడుతున్నావ్ అని ప్రియుడు అడిగితే.. ‘‘వెస్ట్రన్ స్టైల్.. చాలా బాగుంటుంది’’ అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత, అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ప్రియుడు మంటల్లో కాలిపోతూ హాహాకారాలు చేస్తుంటే సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది. బెంగళూరులో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. నగరంలోని బ్యాడరహళ్ళి పోలీస్‌స్టేషన్ పరిధి అంజనానగర్‌లో నివాసముండే ప్రేమ అనే యువతి ఓ టెలికాం స్టోర్‌లో పనిచేస్తోంది. అదే స్టోర్‌లో పనిచేసే కిరణ్(27), ఆమె ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. ఇటీవల కిరణ్ ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నాడనే భావన ప్రేమలో పెరిగిపోయింది. దీంతో అతనిపై పగ పెంచుకుంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కిరణ్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పథకం ప్రకారం కాల్చి చంపేసింది. ఇది ప్రమాదమని భావించిన పోలీసులు.. తొలుత ప్రేమను ఆ కోణంలో ప్రశ్నించారు. ‘నేను వాష్‌రూంకు వెళ్లిన కాసేపటికే కిరణ్ కేకలు వేశాడు. బయటికొచ్చి చూసేసరికి మంటల్లో కాలిపోతున్నాడు’ అని ఆమె నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత నేరాన్ని అంగీకరించింది.